ఈ సర్కారు బడుల్లో సమస్యలు తీరట్లే..

  • వర్షం వస్తే అంబర్​పేట గర్ల్స్​ హైస్కూల్ బంద్​ 
  • గోడలకు పగుళ్లు.. షెడ్డు మధ్యలో భారీ వృక్షం
  • కమ్యూనిటీ హాల్​లో కొనసాగుతున్న బంజారాహిల్స్ ప్రైమరీ స్కూల్
  • ఐదు తరగతులు ఒక్కటే హాల్ లో.. 
  • ఆరేండ్లుగా మురుగు బావి నీళ్లే దిక్కు  
  • పెచ్చులూడుతున్న స్కూల్​పై కప్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ‘మన ఊరు– మన బడి’, ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధి కోసం ఎన్ని స్కీములు తీసుకువచ్చినా కొన్నింటిలో సమస్యలు తీరడం లేదు. హైదరాబాద్​పేరుకు అర్బన్​ఏరియా అయినా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే స్కూళ్ల కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు అంబర్​పేటలోని ప్రభుత్వ గర్ల్స్​ హైస్కూల్ పరిస్థితి చూస్తే.. ఇది దాదాపు 40 ఏండ్లుగా రేకుల షెడ్డులోనే కొనసాతోంది. స్కూలుకు సంబంధించిన ల్యాండ్​ఇష్యూ కోర్టులో నడుస్తోంది. దీంతో రిపేర్లకు నోచుకోవడం లేదు. ఈ స్కూల్​లో వంద మంది దాకా చదువుతున్నారు. భారీ వర్షం కురిస్తే స్కూల్​బంద్​పెట్టి పిల్లలను ఇంటికి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూల్ రేకుల షెడ్డు మధ్యలో నుంచి పెరిగిన పెద్ద వృక్షం కొమ్మలు ఏ క్షణాన విగిరి పడతాయో తెలియదు. గోడలకు పగుళ్లు వచ్చాయి. సమస్యకు ఏదైనా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని టీచర్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

170 మందికి ఒకేచోట చదువులు

బంజారాహిల్స్ ఉదయ్ నగర్ లోని కమ్యూనిటీ హాల్​లో గవర్నమెంట్​ప్రైమరీ స్కూల్​నడుస్తోంది. దాదాపు 170 మంది పిల్లలు ఇక్కడ చదువుతుండగా, అందరినీ ఒకటే హాల్​లో కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారు. దీంతో గందరగోళంగా ఉంటుందని, పిల్లలకు పాఠాలు అర్థం కావడం లేదని టీచర్లు చెబుతున్నారు. కమ్యూనిటీ హాల్​కు మున్సిపల్​వాటర్​కనెక్షన్​లేకపోవడంతో ఆవరణలోని బావి నీళ్లను వాడుతున్నారు. కాలనీవాసులు తరచూ బావిలో చెత్త చెదారం వేస్తుండడంతో మురుగు నీరుగా మారాయి. పిల్లలు, టీచర్లు ఆ నీళ్లనే వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాగడానికి మాత్రం నీటిని ఇండ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. పైకప్పు పెచ్చులు ఊడుతుండడంతో పిల్లలు భయపడుతున్నారు. బాయ్స్, గర్ల్స్​ కు కలిసి రెండే టాయిలెట్స్​ఉండటంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, మూత్ర సంబంధిత వ్యాధులు వస్తున్నాయని టీచర్లు, స్టూడెంట్స్​ వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రెండు స్కూళ్లలో ‘మన ఊరు- మన బడి’, ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ స్కీముల్లో భాగంగా కేవలం మైనర్ రిపేర్లు చేసినట్లు తెలిసింది.