- రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలాంటి వాదనలను వినకుండా యధాతథ స్థితిని కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ), పీజీ (ఆయుష్) కోర్సుల నిబంధనలు 2021ను సవరిస్తూ.. గతేడాది అక్టోబర్ రాష్ట్ర సర్కార్ 148, 149 జీవోలను జారీ చేసింది.
ఈ సవరణను సవాల్ చేస్తూ ఎస్.సత్యనారాయణ, వి.రజితతో పాటు స్థానికతపై సుమారు వంద పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుల ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్ 17న తీర్పును వెలవరించింది. తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగా పరిగణించాలని అందులో పేర్కొంది. అలాగే, తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ‘స్థానికత’వర్తింపజేయాలని ఆదేశించింది.
ఈ తీర్పు 2024– -25 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. హైకోర్టు తీర్పును గతేడాది డిసెంబర్ 18న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌ల బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు వివరణాత్మకంగా తీర్పు వెలువరించిందని, మెరిట్స్‌లోకి వెళ్లకుండా ఈ స్థితిలో స్టే ఇవ్వడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 29న చేపడతామని వెల్లడించింది.