రైతుల్ని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవద్దు : హైకోర్టు

రైతుల్ని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవద్దు : హైకోర్టు
  • పోలీసులకు హైకోర్టు ఆదేశాలు​

హైదరాబాద్, వెలుగు:  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి రైతులను వారి వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో తమ భూముల వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గుడాటిపల్లి వాసి బోయిని భాస్కర్‌‌, ఇతరులు హైకోర్టులో రిట్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ బీ విజయ్‌‌సేన్‌‌ రెడ్డి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల అడ్వకేట్​రవికుమార్‌‌ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం, ఆర్‌‌అండ్‌‌ఆర్‌‌ ప్యాకేజీ ఇంకా ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

జీవనోపాధి కోసం రైతులను వారి పొలాల్లోకి వెళ్లనివ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ సంజీవ్‌‌కుమార్‌‌ వాదిస్తూ.. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పరిహారం చెల్లించిందని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. రైతులను అడ్డుకోవద్దని పోలీసులకు ఆర్డర్స్​ జారీ చేసింది.