కేసీఆర్​ను తెలంగాణ ప్రజలు నమ్మరు

కేసీఆర్​ను తెలంగాణ ప్రజలు నమ్మరు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:  తెలంగాణ ఉద్యమంలో అనేక మాటలు చెప్పి,  ఒక్కటి కూడా అమలు చేయకుండా సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజలను వంచించాడని మాజీ మంత్రి విజయరామారావు ఆరోపించారు. బుధవారం ఖమ్మం  నగరంలో బీజేపీ జిల్లా ఆఫీస్​లో   మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్​కుమార్​,  కిసాన్​ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డితో  కలిసి ఆయన మాట్లాడారు.. టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​గా మారి దేశ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరాడన్నారు. సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజలనే కాదు జాతీయ పార్టీలను సైతం బురిడీ కొట్టించాడని, రాబోయే రోజుల్లో  తెలంగాణ ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరని  తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, శ్యాంరాథోడ్​, గెంటేల విద్యాసాగర్​ తదితరులు పాల్గొన్నారు.

లక్షల కోట్లు ఎట్ల సంపాదించిండు

సత్తుపల్లి, వెలుగు:  ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చిల్లి గవ్వ లేకుండా తిరిగిన రోజులు తమకు తెలుసని, గడచిన 8 ఏండ్ల పాలనలో  8లక్షల కోట్లు మూటగట్టారని మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు.  పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ వెంగళరావు నగర్ ప్రాంతాల్లో సింగరేణి బ్లాస్టింగ్​లతో  దెబ్బతిన్న ఇండ్లను వారు పరిశీలించారు. ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో  బాధితుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం  వారు మాట్లాడుతూ.. వెంగళరావు నగర్ లో దెబ్బతిన్న ఇండ్లకు కేవలం రూ.20 వేల నుంచి రూ.30 వేల ఖర్చుతో రిపేర్లు చేస్తూ లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడుతనేని అప్పారావు,  దేవకీ వాసుదేవరావు, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ణి వీరంరాజు పాల్గొన్నారు.