ఇందిరా, వాజ్ పేయ్ లాంటి వారే ఓడిపోయారు
నేను హెడ్ మాస్టర్ను, రిమోట్ కంట్రోల్ ను కాదు
సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
ముంబై: ఓటర్లను తక్కువ చేసి చూడొద్దని, అలా చేయడం వల్లే బలమైన లీడర్లైన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి వాళ్లు కూడా ఎన్నికల్లో ఓడిపోయారని ఎన్సీపీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ అన్నారు. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్ని కల టైంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘నేను తిరిగి అధికారంలోకి వస్తా”అని ప్రచారం చేశారని, కానీ ఓటర్లు దానిని వేరే విధంగా తీసుకుని ఆయనకు ఓ పాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలోని అధికార కూటమి మహా వికాస్ అగాదీలోని పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసే ఉన్నాయన్నారు. ఈ కూటమిని కంట్రోల్ చేయడానికి తాను హెడ్మాస్టర్ లేదా రిమోట్ కంట్రోల్ ను కాదని, ఉద్ధవ్, ఆయన మంత్రులే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని క్లారిటీ ఇచ్చారు. శివసేన లీడర్, సామ్నా ఎగ్జిక్యూ టివ్ ఎడిటర్ సంజయ్ రౌత్ కు శరద్ పవార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడు పార్ట్ ల ఈ ఇంటర్వ్ సిరీస్ లోని తొలి భాగం శనివారం సామ్నా పేపర్లో పబ్లిష్ అయింది. ఈ పేపర్లో శివసేన పార్టీ నేత కాని వ్యక్తి ఇంటర్వ్యూను సిరీస్ గా పబ్లిష్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు బాల్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే ఇంటర్వ్యూలను మాత్రమే సామ్నా ప్రచురించింది.
అధికారం ఎల్లకాలం ఉండదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘ప్రజాస్వామ్యంలో మనం ఎల్లకాలం అధికారంలో ఉంటామని భావించకూడదు. ఒకవేళ ఓటర్లను తక్కువ చేసి చూసినట్టుగా వారు భావిస్తే.. దానిని వారు సహించరు. పవర్ ఫుల్ లీడర్లు, మాస్ బేస్ ఎక్కువగా ఉన్న ఇందిరాగాంధీ, వాజ్ పేయి లాంటి వాళ్లు కూడా ఇలా అనుకునే ఎన్నికల్లో ఓడిపోయారు”అని శరద్ పవార్ చెప్పారు. డెమొక్రాటిక్ రైట్స్ ప్రకారం పొలిటీషియన్ కంటే కామన్ మ్యాన్ చాలా తెలివైన వాడని, ఒకవేళ మన లాంటి పొలిటీషియన్లు గీత దాటితే.. వాళ్లు ఓ పాఠం చెబుతారని అన్నారు. ‘‘మేం మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం”లాంటి మాటలను వారు ఇష్టపడరని చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు యాక్సిడెంటల్ గా జరిగింది కాదని, లోక్ సభ ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల మూడ్ లో మార్పు వచ్చిందని, మహారాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని, దాని ఫలితమే బీజేపీ ఓటమని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ.. శివసేనను పట్టించుకోలేదు
గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 105 సీట్లలో శివసేన కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని, శివసేన సపోర్ట్ లేకపోతే బీజేపీ బలం 40 నుంచి 50 సీట్లకే పరిమితమయ్యేదని చెప్పారు. కానీ బీజేపీ.. తన మిత్రపక్షమైన శివసేనను పట్టించు కోలేదని, శివ సైనికులను తక్కువ చేసి చూసిందని ఆరోపించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఐడియాలజీ, పనితీరు .. బీజేపీతో సింక్ అవుతాయని తాను ఎప్పుడూ భావించలేదన్నారు.
ఉద్దవ్ తో విబేధాలు లేవ్
రాష్ట్రంలో లాక్డౌన్ కు సంబంధించి సీఎం ఉద్ధవ్ తో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను శరద్ పవార్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని, లాక్డౌన్ పీరియడ్ మొత్తం తాను సీఎంతో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నానని, అది ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి మీరు హెడ్ మాస్టరా? లేక రిమోట్ కంట్రోలా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. హెడ్ మాస్టర్ స్కూల్లో ఉంటారని, డెమొక్రసీలో ప్రభుత్వాన్ని, పాలనను నడిపించడానికి రిమోట్ కంట్రోల్ పని చేయదని చెప్పారు. కూటమి బాధ్యత ఉద్ధవ్ చేతుల్లోనే ఉందన్నారు.
For More News..