కాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి: ప్రొఫెసర్ కంచ ఐలయ్య

కాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి: ప్రొఫెసర్ కంచ ఐలయ్య

హనుమకొండలోని హరిత హోటల్ లో గద్దర్ సంస్మరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ అయిలయ్య, గద్దర్ గళం ఫౌండేషన్ కార్యదర్శి పసునూరి రవీందర్, కూరపాటి వెంకట నారాయణ, పలువురు విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా  ప్రొఫెసర్ కంచ అయిలయ్య మాట్లాడుతూ.. బాల సముద్రంలోని కాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

కళాక్షేత్రంలో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలన్నారు. కళాక్షేత్రానికి కాళోజీ పేరు ఉంచాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కాళోజీ ఒక కవి అని.. కళాక్షేత్రానికి ఆయన పేరు కాకుండా గద్దర్ పేరు పెడితేనే దానికి దేశంలో ఒక గుర్తింపు, గౌరవం వస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, ముద్రను మార్చినట్టే అలాగే కాళోజి కళాక్షేత్రం పేరును మార్చాలని కోరారు. వరంగల్ జిల్లాలో చుక్క సత్తయ్య, శంకర్, సారంగపాణి లాంటి ఎందరో కళాకారులు జన్మించారని తెలిపారు. ఇక్కడి కళాక్షేత్రాలకు వాళ్ల పేరు పెట్టే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం కళాక్షేత్రానికి కాళోజి పేరు పెట్టాలని ఎలా నిర్ణయం తీసుకుందో తెలీదన్నారు. కోట్లు పెట్టి కట్టిన కళా క్షేత్రానికి కాళోజీ పేరు పెట్టడం కులతత్వం కాదా అని ప్రశ్నించారు. గద్దర్ ప్రథమ వర్ధంతి ఆగష్టు 6  నాటికి కమిటీ వేసుకుని  కళాక్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గద్దర్ గళం ఫౌండేషన్ కార్యదర్శి పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టకుంటే తెలంగాణలో కొత్త పోరాటం మొదలవుతుందన్నారు.

కళాక్షేత్రాలకు కళాకారుల పేరు మాత్రమే పెట్టాలని.. కాళోజీ పేరు ఏదైనా లైబ్రరీకి పెట్టాలని సూచించారు. వెంటనే గద్దర్ విగ్రహ స్థాపక కమిటీ వేసి కళాక్షేత్రంలో గద్దర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులు ఈ ప్రభుత్వ చేయొద్దని హితవు పలికారు. జిల్లా కలెక్టర్, అధికారులు, నాయకులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను స్వీకరించి దానికి అనుగుణంగా పని చేయాలన్నారు.