నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై ఇక్కడి రైతులకు హక్కులేదా? : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీళ్లపై అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద ఉన్న రైతులకు సైతం హక్కుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ లీడర్లు, రైతులతో కలసి మండలంలోని కోస్లీ అలీసాగర్ పంప్​హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంజీరా వాటర్​ వృథా పోవొద్దనే ఉద్దేశంతో, గత ప్రభుత్వాలు అలీసాగర్, గుత్ప ప్రాజెక్టులు నిర్మించాయని గుర్తు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వదిలిన వాటర్ నిజామాబాద్ జిల్లాలోని వర్ని వరకు మాత్రమే అందుతుందన్నారు. 

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నీటిపై అలీసాగర్, గుత్త ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు సైతం సమాన హక్కు ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఈ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు నీళ్లివ్వకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ముందస్తు వ్యవసాయం చేయాలని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్,  అన్నీ ప్రాంతాలకు నీరందేలా చూడాలన్నారు. న్యాయం చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మైస రాధ, నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేశ్​కుమార్, సొసైటీ డైరెక్టర్లు రాము, గణేశ్​పాల్గొన్నారు.