- అభివృద్ధి పనులు పూర్తి చేయాలె
- రుణ మాఫీని కంప్లీట్ చేయాలె జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి
జనగామ, వెలుగు : ఎలక్షన్ కోడ్ కూసేలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సభ్యులు గళమెత్తారు. మంగళవారం జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ సుహాసిని, సీఈఓ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యల గురించి విన్నవించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి డీఆర్డీఓ రాం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
Also Read : హైకోర్టుకు హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్..
లింగాల ఘన్పూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ ప్రక్రియ పై రైతుల్లో ఆందోళన ఉందన్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణ మాఫీ జరిగిందనే వివరాలు అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. దీనికి జిల్లా అగ్రకల్చర్ ఆఫీసర్ వినోద్ కుమార్ స్పందించారు. తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజా రెడ్డి మాట్లాడుతూ.. తరిగొప్పుల కేజీబీవీ నిర్మాణం ఎప్పుడు కంప్లీట్ చేస్తారని ప్రశ్నించారు.
డీఈఓ రాము సమాధానమిస్తూ నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.