లక్షల మంది విద్యార్థుల గోసపట్టని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంకా భరించాల్నా?

లక్షల మంది విద్యార్థుల గోసపట్టని కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం ఇంకా భరించాల్నా? కొలువులే కేంద్రంగా కొట్లాడిన రాష్ట్రం ఒక కుటుంబ గడిలో బందీ కావాల్నా? ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనుకుంటున్న నయా నిజాంగిరిని ఇంకా సహించాల్నా? తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన సమయం ఇది. మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం. అమరవీరుల స్వప్నాలను సాకారం చేసుకుందాం. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిర్వహించే నిరుద్యోగుల మార్చ్‌ కార్యక్రమాలను జయప్రదం చేద్దాం. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పిండు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీ పట్ల చిత్తశుద్ధి లేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా పోస్టుల భర్తీలో అన్నీ అవకతవకలే. ప్రశ్నాపత్రాల లీకేజీ నిరుద్యోగులకు శాపమే. ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం నిరీక్షించిన యువతకు స్వరాష్ట్రంలో అన్యాయం జరగడం క్షమించరాని నేరం. నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు ఇంత తల్లడిల్లుతున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించక పోవడం దారుణం.

 

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీలో అసలు దోషులెవరో తేలాలంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరపాలని బీజేపీ కోరుతోంది. కమిషన్​కు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని అందించేది రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సొసైటీ (టీఎస్టీఎస్). మరి ఆ ఐటీ శాఖ మంత్రి ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎందుకు బాధ్యత వహించరు? ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా టీఎస్​పీఎస్సీ రహస్య రూముల్లో ఉన్న ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వెళ్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసలు ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది సర్వసాధారణం అన్నట్లు మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు. పరీక్షల నిర్వహణలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వ డొల్లతనాన్ని దాచుకునేందుకు నిర్బంధాలకు పాల్పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై అక్రమ కేసులతో వేధించాలని యత్నించారు.  కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయి.

రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి

తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లు. వందలాది మంది యువకులు బలిదానం చేసింది, కోట్లాది మంది ప్రజలు పోరాటం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకే కదా? నీళ్లు, -నిధులు, -నియామకాలు అనే నినాదంతో పురుడు పోసుకుని ఆవిర్భవించిన మన తెలంగాణలో అమరుల త్యాగం, కోట్లాది మంది ప్రజల స్వప్నం సాకారమైందా? నమ్మి కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఆయన తెలంగాణకు ఒరగబెట్టింది ఏమిటి? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారు. నిరుద్యోగుల భవిష్యత్తును ఆగం చేసిన కేసీఆర్‌ను గద్దె దించేంతవరకు బీజేపీ పోరాడుతుంది. పరీక్ష పత్రాల లీకేజీలో అసలు దోషి ఎవరో తేల్చేదాకా కొట్లాడుతుంది. ఏ తప్పు చేయనపుడు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఎందుకు వెనకాడుతున్నట్టు? విచారణ మొదలు కాకముందే దోషులు ఎంతమందో ఎలా తేల్చేస్తారు? ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేసే సిట్‌ విచారణతో ఫలితం ఏముంటుంది? మియాపూర్‌ భూములు, నయీం ఆస్తులు, డ్రగ్స్ వ్యవహారాల్లో ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ నివేదికలు ఏమయ్యాయి? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా?

అట్టడుగు వర్గాలు అభివృద్ధి ఏది?

ఎందరో పోరాటాల త్యాగాల పునాదులపై నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతున్నది. ఉద్యమ కారులందరినీ వెనక్కి నెట్టి తమ తాబేదారులను అందలం ఎక్కించింది. తెలంగాణ ఉద్యమ కీలక దశలో ఏనాడు పాల్గొనని వారు ఈనాడు అధికార మదంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఒక అద్వితీయ పోరాటం. విద్యుత్‌, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఉద్యమానికి ఊపిరిలూదారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. జీవో నెం-317 తీసుకువచ్చి తెలంగాణాలోని సొంత బిడ్డలను స్థానికేతరులుగా మార్చే కుట్ర చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌ దారులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అపఖ్యాతి కూడా కేసీఆర్ కే దక్కింది. ఇక పీఆర్సీ ఉద్యోగుల పెండింగ్‌ డీఏల విషయం చెప్పాల్సిన పనిలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అత్యంత ఉపకారంగా ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్‌ను ప్రభుత్వం నీరు గార్చింది. కేంద్రం నుంచి బలహీన వర్గాల విద్య కోసం కోట్లాది రూపాయల నిధులొస్తున్నా సక్రమంగా ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తోంది. తెలంగాణలోని అట్టడుగు వర్గాలు అభివృద్ధి కావడం కల్వకుంట్ల కుటుంబం ఏనాడు సహించలేదని ఈ చర్యలతో రుజువు అవుతోంది.

కలిసి కదం తొక్కుదాం..

రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ప్రశ్నాపత్రాల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతం. వారందరి పక్షాన బీజేపీ  పోరాడుతోంది. బాధ్యుడైన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి కమిషన్​ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ కు బీజేపీ సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల15న ఓరుగల్లు పోరుగడ్డపై నిరుద్యోగ మార్చ్ కు సిద్ధమైంది. కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగే ఈ నిరుద్యోగ మార్చ్ కు నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ నియంతృత్వాన్ని  ప్రశ్నించాలి. నిరుద్యోగ యువత అంతా వరంగల్‌కు రండి. కలిసి కదం తొక్కుదాం. ఉద్యోగ నియామకాలు సహా నిరుద్యోగ భృతి, ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ తీరును ప్రశ్నిద్దాం.

డా. గంగిడి మనోహర్ రెడ్డి 
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీజేపీ