ఏం చేస్తరో చేస్కోండి.. ఏ విచారణకైనా నేను సిద్ధం: కేటీఆర్​

ఏం చేస్తరో చేస్కోండి.. ఏ విచారణకైనా నేను సిద్ధం: కేటీఆర్​
  • అమృత్ స్కీంపై కంప్లయింట్​ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే
  • త్వరలో వివిధ స్కామ్​లపై సీరియల్స్​ ఉంటయ్ 
  • తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే కేంద్రం ఏం చేస్తున్నది?
  • కేసీఆర్​ను తిట్టకపోతే రేవంత్​కు పూట గడవట్లేదు
  • మహారాష్ట్ర నుంచి తప్పుకున్నం.. తెలంగాణపైనే ఫోకస్ పెట్టినం
  • ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్​లో తొలిసారి కేటీఆర్​ ప్రెస్​మీట్​

న్యూఢిల్లీ, వెలుగు: ఏ విచారణకైనా, ఏ ఏజెన్సీలు పంపినా తాను సిద్ధంగా ఉన్నానని, ఏం చేస్తరో చేస్కోవాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. అమృత్ స్కీంలో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి కంప్లయింట్​ చేసినట్టు చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేతల్లో దడ మొదలైందని అన్నారు.  ఇది ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమేనని, మున్ముందు సివిల్ సప్లైస్, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్కామ్​ వంటి సీరియల్స్​ ఉంటాయని తెలిపారు. తనను ప్రశ్నించే ముందు మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడుల అప్ డేట్ ఏంటో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఈ దాడుల నుంచి బయటపడేందుకు కోహినూర్ హోటల్​లో  అదానీ కాళ్లు పట్టుకున్నది వాస్తవం కాదా? అనేది పొంగులేటి స్పష్టం చేయాలని అన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసులో త్వరలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి పదవులు ఊడతాయని తెలిపారు. కాంగ్రెస్ అవినీతిని దేశ ప్రజల ముందు పెట్టేందుకు తాను బరాబర్ ఢిల్లీ పర్యటనలు చేపడతామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​లో కేటీఆర్​ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ‘సీఎం రేవంత్ తన బామ్మర్ది సుజన్​కు అమృతం పంచి.. కొడంగల్​వాసులకు విషం పంచుతున్నారు. 

కేవలం రెండు కోట్ల లాభాల్లో ఉన్న అర్హత లేని సుజన్​ రెడ్డి కంపెనీకి రూ. 1,137 వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారు. సీఎం బామ్మర్ది కాబట్టి.. ఆర్టీఐ ద్వారా అడిగినా ఎక్కడా సమాచారం లేకుండా చేసిండ్రు. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నరు. అందుకే కొడంగల్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నరు. పోలీసు రక్షణ లేకుండా కొడంగల్ పోయే పరిస్థితి లేదు. కలెక్టర్ ను కొట్టే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ ఎప్పుడు జరగలేదు’ అని పేర్కొన్నారు. 

ఇక్కడ పునర్​వైభవం వస్తే..దేశవ్యాప్తంగా ముందుకు..

తెలంగాణలో ఓటమితో ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు కేటీఆర్​ చెప్పారు. తిరిగి తెలంగాణ లో పునర్వైభవం సాధించాకా.. దేశ వ్యాప్తంగా ముందుకెళ్తామని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు ఓటెయ్యొద్దని, ప్రాంతీయ పార్టీలకు మద్దతివ్వాలని అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పైసల వరద పారుతున్నదని, సరిహద్దుల్లో మరిన్ని చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. 

‘‘కేసీఆర్ నామస్మరణ చేయకుండా రేవంత్ రెడ్డికి ఒక్క పూట కూడా గడవట్లేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నిజంగానే మర్చిపోతే నీకెందుకు బాధ?” అని అన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్ధపు ప్రకటనలకు మాత్రం ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న విధానాన్ని తప్పుబడుతున్నట్టు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను ఎన్యుమరేటర్లుగా పెట్టి సమాచారం సేకరిస్తే.. భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇది మాన్యూవల్ పెగసెస్ అని అభివర్ణించారు. కుల గణనపై ప్రజలందరిలోనూ ఒక ఆందోళన ఉందని, ఈ సమాచారం తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కత్తిరిస్తారని భయపడుతున్నారని చెప్పారు.

రేవంత్​ను విమర్శిస్తే సంజయ్​ రిప్లై ఇస్తున్నరు

సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణ కవచంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పై విమర్శలు చేస్తే.. ముందు  సంజయ్ రిప్లై ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. ఒక్కరూ కాంగ్రెస్ ను విమర్శించే సాహసం చేయడం లేదన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ (రాహుల్, -రేవంత్) ట్యాక్స్ నడుస్తున్నదని స్వయానా ప్రధానమంత్రే విమర్శిస్తున్నారని, మరి ఆ మాటల్లో నిజముంటే  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తాము ఇచ్చిన అమృత్ స్కీం  ఫిర్యాదుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేది వైఫల్యాల వార్షికోత్సవాలని కేటీఆర్  ఎద్దేవా చేశారు.