సలాడ్స్ తింటున్నారా... అయితే మీ పొట్ట బ్యాక్టీరియాకు నివాసమే..

 సలాడ్స్ తింటున్నారా...   అయితే మీ పొట్ట బ్యాక్టీరియాకు నివాసమే..

రెడీ టు ఈట్ సలాడ్స్ తింటున్నారా? అది ఆరోగ్యానికి ప్రమాదకరం అని బ్రెజిల్ లో చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. ఆ నిజాలు ఆందోళన రేకెత్తించేలా ఉన్నాయి. నిజానికి కూరగాయలు, పండ్ల ముక్కలతో నిండి ఉన్న సలాడ్లు ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి? కానీ శానిటైజ్డ్ సలాడ్లలో సైతం రోగకారకాలైన బాక్టీరియా ఉండే అవకాశం ఉందని ఈ  స్టడీలో పేర్కొనడమే ఆందోళన కలిగిస్తోంది. 

పరిశుభ్రతకు సంబంధించిన ఇండికేటర్స్ ను ఈ స్టడీ రీసెర్చ్ డేటాలో పేర్కొన్నారు. అందులో పేథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంది. అందులో తేలినదాన్ని బట్టి  ఎస్చెరిచియా కోలి  బాక్టీరియాది 0.7 శాతం నుంచి నూరు శాతం వ్యాప్తి ఉందని వెల్లడైంది. ఈ సలాడ్లల్లో గుర్తించిన మరో బాక్టీరియా సాల్మానెల్లా ఎస్ పిపి. దీని వ్యాప్తి రేటు 0.6 శాతం నుంచి 26.7 శాతం ఉంది. మరో బాక్టీరియా లిస్టిరియా మోనోసైటోజెనిస్ 0.2 శాతం నుంచి 33.3 శాతం వ్యాప్తి రేటు ఉందని తేలింది. 

2000 నుంచి 2021 సంవత్సరం వరకూ బ్రెజిల్ లో నమోదైన  ఫుడ్ కు సంబంధించిన జబ్బుల్లో  కలుషిత ఆహారకేసుల గురించి కూడా  స్టడీ డేటాలో నమోదుచేశారు. విచిత్రమేమిటంటే వీటన్నింటిలో తాజా కూరగాయల వినియోగంతోనే విషాహారం కేసులు నమోదుకావడం. ఈ స్టడీలో వినియోగించిన కూరగాయలు తాజావా లేదా ఎంపివి (మినిమల్లీ ప్రాసెస్డ్ వెజిటబుల్స్)  అనే సమాచారం లేదని అధ్యయనకారులు స్టడీలో పేర్కొన్నారు.  

రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ సలాడ్ లో సర్వసాధారణ బాక్టీరియా  లిస్టిరియా మోనోసైటోజెనిస్ గుర్తించడం జరిగింది. ఇది లిస్టిరియా ఇన్ఫెక్షన్లను రేకెత్తిస్తుంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారంటున్నదాన్ని బట్టి ఈ బాక్టీరియా ఎక్కువగా గర్భిణీస్త్రీలకు, నవజాతశిశువులకు, అరవై ఐదేళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు, బలహీనమైన రోగనిరోధకవ్యవస్థ ఉన్నవారికి అధికంగా ఇన్ఫెక్టవుతుందిట. సాల్మోనెల్లా బాక్టీరియా ప్రీప్యాకేజ్డ్ సలాడ్లల్లో బయటపడింది. ఈ బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. 

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఎంపివిల వినియోగం ప్రపంచం యావత్తూ విపరీతంగా పెరిగింది. పైగా ఆహారసంబంధమైన జబ్బులకు తాజా కూరగాయలు, ఎంపివిలకు సంబంధం ఉంటోందన్న అభిప్రాయాన్ని బ్రెజిల్ లోని  యూనివర్సిటీ ఆఫ్ సాయో పాలోస్  లూయిజ్ డె  క్విరోజ్ కాలేజ్ ఆఫ్  అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన యాగ్రో ఇండస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగానికి చెందిన  ప్రొఫెసర్ డేనియల్లీ మఫీ వ్యక్తంచేశారు. ఆమె ఈ వ్యాఖ్యలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.