- కరీంనగర్లో ఏ టెంపుల్కైనా వచ్చేందుకు సిద్ధం
- డబ్బులు పంచలేదని ప్రమాణం చేసే దమ్ము ఉందా?
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. 'నేను ఓటర్లకు డబ్బులు పంచలేదని తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధం. అదే సమయంలో నువ్వు(గంగుల) ఓటర్లకు డబ్బులు పంచినట్లు కూడా ప్రమాణం చేసేందుకు రెడీగా ఉన్నా. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కేసీఆర్ ను తీసుకురా. కరీంనగర్ లోనైతే నువ్వు, నీ కార్యకర్తలతో రా.. ఓటర్లకు డబ్బులు పంపించలేదని ప్రమాణం చేసే దమ్ముందా? అట్లాగే కొత్తపల్లిలో డబ్బులు పంచిన బీఆర్ఎస్ నాయకులను చూపిస్తా.. వాళ్లతో కూడా ప్రమాణం చేయించే సత్తా ఉందా?'అని ప్రతి సవాల్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. అలాగే మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దొంగే దొంగతనం చేసి పోలీసును చూసి దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది’ అని ఎద్దేవా చేశారు.
కొడుకు, మేనల్లుడితో క్రికెట్ఆడిన సంజయ్
ప్రచారం ముగియడంతో సంజయ్ బుధవారం కార్యకర్తలు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో సరదా గా గడిపారు. తన కొడుకు, మేనల్లుడితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. అభ్యర్థులంతా పోలింగ్ ముందురోజు పోల్ మేనేజ్ మెంట్ లో నిమగ్నమై ఉంటే అందుకు భిన్నంగా బండి సంజయ్ సరదాగా గడిపారు. సంజయ్ గురువారం 9 గంటలకు జ్యోతి నగర్ లోని సాధన స్కూల్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.