బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ఉద్యమపాట

ఆదిలాబాద్ ఆదివాసీల గుండెల్లో నినదించి.. నిజామాబాద్ చౌరస్తాలో, కరీంనగర్ కచ్చీరులో నిలువెల్లా నిప్పుల కొలిమై రగిలి.. మెతుకుసీమ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించింది తెలంగాణ ఉద్యమపాట. ఓరుగల్లును పోరుగల్లు జేసి.. ఖమ్మం మెట్టులో ‘అసైదులా ఆడి..’, నదులున్నా నడవలేని నల్లగొండ గోసను, పాలమూరు వలసజీవుల కన్నీళ్లను తనలో దాచుకొని గర్జించింది తెలంగాణ ఉద్యమపాట. రంగారెడ్డి, హైదరాబాద్ అడ్డా మీద తుపాకీ తూటాలకు, ఇనుప సంకెళ్లకు ఎదురొడ్డి... గల్లీ నుంచి ఢిల్లీ దాకా తొలి, మలిదశ ఉద్యమంలో కలబడి, తలబడి, నిలబడింది.. మన తెలంగాణ ఉద్యమ పాట! ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నామంటే.. దాని వెనుక అమరుల త్యాగాలు, సకలజనుల పోరాటాలు, వాటన్నింటినీ కైగట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన అజ్ఞాత కవుల ప్రసవ వేదనలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ పోరులో పొద్దుపొడిచిన పాటలు, కవితలు.. వందలు, వేలు. వాటిని ‘నిప్పులవాగు’గా ముందుకు తెచ్చారు లోకకవి అందెశ్రీ. ఈ మహా సంకలనం.. అణచివేతలపై మర్లవడ్డ మట్టిమనుషుల గొంతుక, తరతరాలకు దారి చూపే తెలంగాణ వారసత్వ స్ఫూర్తి దీపిక. 

వాగు ఉధృతి ముందు చెత్తా, చెదారం కొట్టుకుపోవడం పక్కా. తెలంగాణ ఉద్యమ పాటల నిప్పులవాగు ముందు.. వలస పాలకుల కుట్రల కత్తులు తుత్తునీయలైనయ్. ఇప్పుడు ఆ పాటల వాగు మౌనంగా ఉండొచ్చు. సందర్భం వచ్చినప్పుడు రూపు మార్చుకొని మళ్లీ ఉప్పొంగడం ఖాయం. ‘‘బొందలను తవ్వి, బొక్కలను దీసి పుస్తకాలుగా అచ్చుపోసినవాళ్లకు, అడుగడుగునా అధికారంతో అంటకాగినవాళ్లకు తెలంగాణ ఉద్యమపాటలంటే తక్కువ చూపా? లేక సారు ఆనతినివ్వలేదనా?” అన్న ప్రశ్నే తనను ఈ సంకలనం వైపు అడుగులు వేయించిందంటారు అందెశ్రీ తన సంపాదకీయ వాక్యంలో. ‘‘కరమున చిల్లిగవ్వ లేకున్నా.. ఆత్మవంచన దరులను, అహంకారపు గిరులను నిలువునా తెగకోస్తూ, గుప్పున ఉబికి వచ్చినదే ఈ నిప్పులవాగు” అంటూ తెలంగాణ ఉద్యమ పాటలను, కవితలను ఒక్కటొకటిగా దోసిళ్లతో తీసుకొని భుజాలకెత్తుకొని.. మహాగ్రంథంగా తీసుకొచ్చారు ఆయన. 

13 వందలకు పైగా పేజీలున్న ఈ ‘నిప్పులవాగు’ సంకలనంలో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల  పాటలు, కవితలతోపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పురుడుపోసుకున్న పాటలు కూడా ఉన్నాయి. మొత్తంగా 790 పాటలు, కవితల సమాహారం ఇది. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్​తేజ, దాశరథి, కాళోజీ, నిఖిలేశ్వర్, వరవరరావు, జయధీర్ తిరుమలరావు, జింబో, కేతావత్ సోమ్లాల్, మిత్ర, అమ్మంగి వేణుగోపాల్, జూపాక సుభద్ర.. ఇలా ఎందరో గేయ కవులు, వచన కవుల రచనలు ఇందులో చదవొచ్చు. చదువుతూ గొంతెత్తి పాడుకోవచ్చు. ‘నిప్పులవాగు’లోని ప్రతి పాట, ప్రతి కవిత ఓ నిప్పుకణిక. అది నిస్తేజం నిండిన గుండెల్లో ఉత్తేజపు జ్వాలను రగిలిస్తది. అణచివేతలపై సాగే అస్తిత్వ 
పోరాటాలకు ఆయువులూదుతది! 

మలిదశ ఉద్యమమప్పుడు నాలుగు కోట్ల ప్రజల నాలుకల మీద కదలాడిన ‘‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’’ పాటతో ఈ సంకలనం మొదలవుతుంది. అందెశ్రీ రాసిన ఈ గీతం.. మూడు నాలుగు చరణాల వరకే మనం విన్నాం.. అవే పాడుకున్నాం. కానీ, ‘నిప్పులవాగు’లో 11 చరణాలతో పూర్తి పాట పాఠం మనకు కనిపిస్తుంది. పల్లవిలోని చివరి పాదం ‘‘పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’’ను ‘‘పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’’గా మార్చి అచ్చేశారు అందెశ్రీ. స్వరాష్ట్రం సిద్ధిస్తే ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ రాష్ట్ర గీతంగా అమలులోకి తెస్తామని ఉద్యమ సందర్భంలో ప్రగల్భాలు పలికిన నాయకులు.. ఇప్పుడు పాలకులుగా ఏలుతున్నా.. నోరు మెదపడం లేదు. పైగా.. ‘‘ఒకడు రాసి ఇంకొకడు పేరు మోస్తే ఓ పాటమ్మా.. కనులారా జూసి ఏమీ జేయలేక కుమిలి కుమిలి పోతావు ఓ పాటమ్మ..” అని పాటమ్మ భిక్షపతి తన ‘పాటమ్మ పాట’లో రాసినట్లుగా ఇప్పుడు ఉద్యమ పాటలపై కుట్రల కత్తులు కోలాటమాడుతున్నాయి. 

‘‘సూడు సూడు నల్లగొండా.. గుండెనిండ ఫ్లోరైడు బండా’’ పాటను కోదారి శ్రీను రాస్తే.. దాన్ని ఆ మధ్య కొందరు  తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కుట్రలు ఛేదించాలన్నా, చరిత్ర గురించి తరాలకు తెలియాలన్నా, ఇలాంటి సంకలనాలు రావాల్సిందే. ఆ అజ్ఞాత కవులు ఎవరో లోకానికి తెలియాల్సిందే. అందులో భాగంగా వచ్చిన తొలి ప్రవాహం ఈ ‘నిప్పులవాగు’. ‘‘అరే..! నైజామోని పైజామూడగొట్టింది.. రజాకారు మూకలను దిగంతాలకు తరిమికొట్టింది.. గడీలకు అగ్గిపెట్టింది.. రాచరికానికి గోరీ కట్టింది.. తెలంగాణమంటే పిడికెడు మట్టారా? పిపిలీకాది బ్రహ్మపర్యంతం కంపరం బుట్టించే మందుపాతర’’ అంటూ సవాల్​ విసురుతూ.. ఈ గొప్ప సాహసానికి తొవ్వ తీసిన అందెశ్రీకి శతకోటి శనార్తులు.
- అంబట్ల రవి