నేడు వరల్డ్​ ఎగ్​ డే.. ఏడాదికి ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?

వెజ్, నాన్​ వెజ్​ తినే వారిలో ఎక్కువ మందికి ఇష్టమైన ఐటం కోడి గుడ్డు. అదో పోషకాల గని. ఆరోగ్య ప్రదాయిని. అసలు గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో అనుమానం లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్ తో నిండిన సూపర్ ఫుడ్డు.

గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి. అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం.. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్లు, 78 కేలరీల ఎనర్జీ ఉంటాయి. నిజానికి గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని కీలక విటమిన్లు, మినరల్స్, అన్సాచ్యురేటెడ్  కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. తెల్ల సొనలో ఆల్బుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రొటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. మహిళల్లో ఎముకల బలానికి, ఆస్టియోపొరోసిస్ ను దూరంగా ఉంచడానికి సాయపడుతుంది. గుడ్డులోని తెల్ల సొనలో హిస్టోడిన్‌‌, పచ్చసొనలో జింక్‌‌, కోలీన్‌‌, అయోడిన్‌‌, లినోలిక్‌‌ ఆసిడ్‌‌ ఉంటాయి. వీటితో కొత్త మేథస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి.

వారానికి మూడుసార్లు..

గుడ్లలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డులోని పచ్చసొన గర్భిణులకు, పిల్లలకు చాలా ఆరోగ్యకరం. గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌‌ డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలీన్‌‌, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడుసార్లు, రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కోడి గుడ్డు తింటే కంటికి ఎంతో మేలు కలుగుతుంది. రోజూ గుడ్డు తినేవారికి కంటిచూపు బాగుండటంతోపాటు, శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌‌-–ఏ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసొనలోనే అధికం. కంటి దోషాలను నివారించే జింక్‌‌, సెలినియం, విటమిన్‌‌ ఈ ఇందులో అధికంగా ఉన్నాయి.

ఇండియన్స్​లో ప్రొటీన్ల లోపం..

ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో రిపోర్టు ప్రకారం.. 80 శాతం మంది ఇండియన్స్​ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రొటీన్ ను ఆహారంలో తీసుకోవాలి. మరో రీసెర్చ్ రిపోర్టు ప్రకారం.. 70 నుంచి 90 శాతం మంది ఇండియన్స్​లో విటమిన్ డి లోపం ఉంది. మన దేశంలో ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినా, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికీ లభించటం లేదు. ఈ పరిస్థితి రూరల్​ ఏరియాల్లో ప్రజలు, మరీ ముఖ్యంగా పెరిగే పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి పేదరికం ఒక కారణం కాగా, వారికి ఆహార పదార్థాలు, వాటి పోషక విలువల గురించి అవగాహన లేకపోవడం మరో ముఖ్య కారణం. మన దేశంలో పుట్టే పిల్లల్లో మూడో వంతు మంది పుట్టినప్పుడు ఉండవలసిన కనీస బరువు 3.2 కిలోగ్రాములు కూడా ఉండటం లేదు. అలాగే, మన దేశంలో 4 ఏండ్ల లోపు వయసు పిల్లల్లో ఎక్కువ శాతం మందికి సరైన పోషకాహారం లభించకపోవడం వల్ల వారు ఉండవలసిన బరువు లేక, ఎదగవలసినంత ఎత్తు ఎదగడం లేదని సర్వేల్లో తేలింది.

పది లక్షల మందికి ఉపాధి

దేశంలో కోళ్ల ఫారాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయలను “జీడీపీ” రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అందిస్తోంది. మన దేశంలో మొక్కజొన్న, సోయాబీన్లు వంటి పంటలు పండించే కోటి మంది రైతులకు, వారి పంటలను మంచి ధరలకు అమ్ముకోవడానికి కోళ్ల పరిశ్రమ అవకాశం కల్పిస్తోంది. కోళ్ల రైతుల విశేష కృషి వల్ల కరోనా లాక్ డౌన్ సమయంలోనూ గుడ్ల ఉత్పత్తి, సరఫరా నిరంతరం కొనసాగింది.

ఏటా 180 గుడ్లు తినాలి

ప్రతి వ్యక్తి ఏటా కనీసం 180 గుడ్లు తినాలని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ న్యూట్రిషన్​ చెబుతోంది. కానీ, మన దేశంలో సగటు గుడ్ల వినియోగం 70 మాత్రమే ఉంది. గుడ్ల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నా.. వాడకంలో వెనుకబడింది. తలసరి గుడ్ల వినియోగం బాగా పెరగాలి. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. కానీ మన దగ్గర అది 70కి మించడం లేదు. గుడ్ల వాడకంలో ప్రపంచంలో మనం 114వ ర్యాంకులో ఉన్నాం. ఈ విషయం గుర్తించిన మన ప్రభుత్వాలు కూడా, స్టూడెంట్లు, గర్భిణులకు మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ ద్వారా గుడ్ల పోషకాల ప్రాధాన్యం, వినియోగంపై ప్రచార, అవగాహన కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్​ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరగా కోలుకోవాలన్నా.. గుడ్డులోని పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి.

సురేశ్​ చిట్టూరి,చైర్మన్, ఇంటర్నేషనల్​ ఎగ్ కమిషన్