
ప్లాస్టిక్... ఒకప్పుడు ఇది ఒక వరంలా అనిపించింది. అదే ఇప్పుడు శాపంగా మారింది. ఒక మనిషి తన డైలీ లైఫ్‌లో ఎన్ని రకాలుగా ప్లాస్టిక్ వాడుతున్నాడో చెప్పనక్కర్లేదు. అవసరమైన మేరకు వాడితే ఏదీ నష్టం కాదు. మితిమీరితేనే మొదటికి మోసం వస్తుంది. ప్లాస్టిక్ విషయంలోనూ అదే జరుగుతోంది. దీని వాడకం పెరిగే కొద్దీ ప్రాణకోటికి పెను ముప్పుగా మారుతోంది. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన కొన్ని దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాయి. మరికొన్ని దేశాలు రీసైక్లింగ్ అంటూ పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి. ఇటీవలే మన పొరుగురాష్ట్రం కర్నాటకలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్‌కు కారణమవుతుందని తేలింది. దీంతో ఆ ప్రభుత్వం ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడొద్దని నిషేధం విధించింది. అదొక్కటే కాదు.. ఎన్నిరకాలుగా ప్లాస్టిక్ తింటున్నామో తెలుసా..? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రపంచంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలను విపరీతంగా ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా దాదాపు 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతోంది. దీనికి కారణాలు ప్లాస్టిక్ వేస్ట్‌ను కంట్రోల్ చేయకపోవడం, సరిగా డిస్పోస్ చేయకపోవడం. దీనివల్ల ఇండియా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే అసలు సమస్య అదేనా?
డైలీ లైఫ్‌లో..
డైలీ లైఫ్‌లో రోజుకు ఎంత ప్లాస్టిక్ మన ఇంటికి తీసుకొస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఇలా ఎన్నో సందర్భాల్లో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తుంటాం. ఇక బయట ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తుంది. వాటిలో చాలావరకు ఇంటికి తెచ్చిన అరగంటలో చెత్త బుట్టలోకి వెళ్లిపోతాయి. కానీ, మీరు తెచ్చిన కవర్లో ఫుడ్ వేడిగా ఉంటే ఆ వేడికి కవర్ కరిగి ఆహారంలో కలుస్తుంది. అది తిన్న మన శరీరంలోకి నేరుగా చేరుతుంది. ఇందుకు లేటెస్ట్గా జరిగిన కర్నాటక సంఘటనే ఉదాహరణ. పొద్దున్నే చాలామంది బయట టిఫిన్ సెంటర్లలో తింటుంటారు. అయితే అక్కడ ఒక హోటల్లో ఇడ్లీప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ పెట్టి దానిపై పిండి వేస్తున్నారు. తర్వాత మూతపెట్టి ఎప్పటిలానే ఆవిరి మీద ఉడికిస్తున్నారు. ఆ వేడికి ప్లాస్టిక్ కరుగుతుంది. దాంతో అలా ఉడికిన ఇడ్లీలను తినడం వల్ల మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతుంది. అది దీర్ఘకాలంలో క్యాన్సర్‌కి దారితీస్తుంది. ఈ విషయాన్ని అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసింది.
ఈ ఘటనతో ఫుడ్‌ని తయారుచేసే విధానంలో శుభ్రత, నాణ్యత పాటించకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని మరోసారి రుజువైంది. ప్లాస్టిక్ వాడడం వల్ల రీ–ప్రొడక్షన్ సిస్టమ్‌ను దెబ్బ తీస్తాయి. దానివల్ల హార్మోన్ల వ్యవస్థలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవల్స్‌లో తేడాలు వచ్చే ప్రమాదముంది. దీంతో ప్లాస్టిక్ వాడకం సంతానలేమికి కారణం అవుతుందని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. అంతేకాదు శిశువు బొడ్డుతాడులో కూడా మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారంటే ఎలాంటి జీవనం గడుపుతున్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్లాస్టిక్.. పెనుభూతం
ప్లాస్టిక్ డీగ్రేడ్ కావడానికి దాదాపు వెయ్యేండ్లు పడుతుంది. అప్పుటికీ అది డీ కంపోజ్ కాకుండా మైక్రోప్లాస్టిక్స్‌గా మారుతుంది. మనుషులు, జంతువులకు విషంగా మారుతుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాల్లో 6 శాతం గంగా నది నుంచే వస్తోందని కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. అంతేకాదు.. సముద్రంలో ఉండే ఎన్నో రకాల జలచరాలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారమనుకుని మింగడం వల్ల చనిపోతున్నాయి. చనిపోయిన సముద్ర పక్షుల పొట్టనిండా ప్లాస్టిక్ వ్యర్థాలే. పెంపుడు జంతువులు, పశువులు కూడా ప్లాస్టిక్‌ని నేరుగా తినడం వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇదంతా మనుషులు ప్లాస్టిక్ వాడడం వల్లే. ఇకపోతే మనం పసిపిల్లల పాల డబ్బాల నుంచి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ టూత్ పేస్ట్, టీ కప్పులు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిని వాడడం వల్ల మన రక్తంలోకి ప్లాస్టిక్ చేరుతుంది. ఫుడ్ ప్యాకేజీలో వాడే ప్లాస్టిక్‌ను పాలిస్టెరిన్ ప్లాస్టిక్ అంటారు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్‌లో వాడే వాటిని పాలిథైలిన్ టెరెఫ్టలేట్ ప్లాస్టిక్ అంటారు. వీటిలో ఎక్కువ కాలం నిల్వ ఉంచినా, వేడి పదార్థాలు వేసినా ప్లాస్టిక్ కరిగి ఫుడ్‌లో చేరుతుంది. ప్లాస్టిక్ తిన్న చేపలు తినడం వల్ల దానిలోఉన్న మైక్రో ప్లాస్టిక్ రక్తంలోకి వెళ్తుంది. అంతేకాదు.. ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల విషవాయువులు విడుదలవు తున్నాయి. అవి గాలి కాలుష్యానికి, టెంపరేచర్ పెరగడానికి, అకాల వర్షాలకు కారణమవుతున్నాయి. రీసైక్లింగ్ చేయడం వల్ల కూడా ఇదే ఎఫెక్ట్. గాలి ద్వారా కూడా శరీరంలోకి చేరుతుంది ప్లాస్టిక్.
రీప్లేస్... ది బెస్ట్!
నిజం చెప్పాలంటే ప్లాస్టిక్ పరిచయం కాకముందు మనం ఆచరించిన పాత పద్ధతులే నూటికి నూరుపాళ్లు ఆరోగ్యవంతం! ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్‌కి బదులు ఏం వాడొచ్చు? అని ఆప్షన్లు వెతికే వాళ్లకు ఇప్పుడు కనిపిస్తున్న సొల్యూషన్స్ అవే. ఉదాహరణకు స్టీల్ లంచ్ బాక్స్, స్ట్రా, స్పూన్ వంటివి ఎప్పటి నుంచో వాడుతున్నవే. టూత్ పేస్ట్, బ్రష్‌ల బదులు వేప పుల్ల, వెదురు బ్రష్‌లు వాడమంటున్నారు. ప్లాస్టిక్ సబ్బు పెట్టెలకు బదులు స్టీల్, చెక్క పెట్టెలు లేదంటే సబ్బుని సోప్ సేవర్ బ్యాగ్‌లో పెట్టి స్క్రబ్‌లా వాడొచ్చు. షాంపూ బాటిల్స్, కవర్ల బదులు షాంపూ బార్ (సబ్బు)లను వాడాలి. బట్టలు ఉతకడానికి గుర్రం వెంట్రుకలతో తయారుచేసిన బ్రష్‌లు దొరుకుతాయి. నీళ్లకు రాగి (కాపర్) బాటిల్స్ వాడితే ఆరోగ్యానికి మేలు. కూల్ డ్రింక్స్ సీసాల్లో ఉండేవి బెటర్. ఇంట్లో, ఆఫీసులో పెన్నులు, క్లిప్‌లు పెట్టుకోవడానికి వెదురు లేదా ఐరన్ పెన్ హోల్డర్ బెస్ట్ ఆప్షన్. చాకు, చాప్ బోర్డ్ వంటివి చెక్కతో చేసినవి ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్‌లా కొబ్బరి పీచు లేదా ఐరన్ పీచు. ఆర్గానిక్ ఇయర్ బడ్స్ దొరుకుతున్నాయి. చెక్క బొమ్మలు, ఆట వస్తువులు, వెదురుతో తయారుచేసిన కాలిక్యులేటర్. ఇలా ఏది కావాలన్నా.. దాదాపు ప్లాస్టిక్‌కి ఆల్టర్నేట్ వస్తున్నాయి. గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుందని వెనుకడుగేస్తారేమో.. కానీ, ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యం పాడైతే చెల్లించే డబ్బుల కంటే అవి అంత ఎక్కువేం కాదు. పైగా ఒక్కసారి కొంటే చాలా రోజులు వాడుకోవచ్చు. అవసరం లేదనిపిస్తే రీసైక్లింగ్ చేయొచ్చు. దీనివల్ల మనుషులకు, పశువులకు, పక్షులకు.. మొత్తంగా పర్యావరణానికి అంతా మేలే.
పరిష్కారం అదే
అసలు ప్లాస్టిక్ ఎందుకు వాడాలి? అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరక్కపోదు. ఎందుకంటే ఇడ్లీ తయారీ విషయమే తీసుకుంటే గతంలో క్లాత్ వాడేవాళ్లు. దాంతో పోలిస్తే ప్లాస్టిక్ కవర్ అయితే ఖర్చు తక్కువ. మళ్లీ దాన్ని శుభ్రం చేసే పనుండదు. ఒకసారి వాడి పడేస్తే సరిపోతుంది. కాబట్టి పని త్వరగా, ఈజీగా అయిపోతుంది. అందుకని వ్యాపారులకు ప్లాస్టిక్ వరంలానే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటేనే దాన్ని కంట్రోల్ చేయగలం. బ్యాన్ చేశాక కూడా వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. బయోడీగ్రేడబుల్‌గా ఉండే జనపనార, ఫ్యాబ్రిక్ సంచులను వాడేలా ప్రోత్సహించాలి. వీటిని రీసైక్లింగ్ కూడా చేయొచ్చు. గోధుమ, జొన్న, శనగ, సోయా, బియ్యప్పిండి, ఊక వంటివాటితో తినే ప్లేట్లు, స్పూన్లు తయారుచేస్తున్నారు. అంతేకాదు.. ఆలుగడ్డలతో కూడా క్యారీ బ్యాగులు, స్పూన్లు, చిన్న ప్లేట్స్, పిల్లల ఆట వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల ప్రజలకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది. వీటిని తినొచ్చు. పశువులకు మేతగా వేయొచ్చు. కొన్ని దేశాలు ఇప్పటికే వీటిని వాడుతున్నాయి. ప్లాస్టిక్ - ఫ్రీ ఇండియాగా మారాలంటే ప్రభుత్వం చేసే ప్రయత్నాలతోపాటు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందడుగు వేయాలి.
అప్పుడే తెలిసింది కానీ..
1907లో తొలిసారి మాడ్రన్ ప్లాస్టిక్ బేకలైట్‌ను లియో బేక్ ల్యాండ్ అనే బెల్జియన్ కెమిస్ట్ అమెరికాలో కనుగొన్నాడు. అప్పుడు దాన్ని ఎలక్ట్రిక్ వైరింగ్‌లో వాడారు. తర్వాత దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చని తెలిసింది. కొన్నేళ్లలోనే రకరకాల ప్లాస్టిక్ వెరైటీలు, వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. 1939 –45 మధ్య అంటే ప్రపంచ యుద్ధం టైంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. 1980లోనే ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై చర్చలు మొదలయ్యాయి. కానీ, దానివల్ల ప్లాస్టిక్ అసలు లక్షణం కోల్పోతుందని, అలా తయారుచేసిన వాటిని వాడలేమని గుర్తించి రీసైక్లింగ్ చేయడం తగ్గించాయి. 2004లోనే ప్లాస్టిక్ వస్తువులు మైక్రో ప్లాస్టిక్లుగా మారుతున్నాయని సైంటిస్ట్‌లు కనుగొన్నారు. వాటిని సముద్ర జీవులు తింటున్నాయని తెలుసుకున్నారు. దానివల్ల వాటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించారు. కానీ, ప్లాస్టిక్ తయారీ కంపెనీలు తీసేస్తే ఎంతోమంది జీవనోపాధి పోతుందని వెనక్కి తగ్గారు. తర్వాత రీసైక్లింగ్, కంట్రోలింగ్ మీద ఫోకస్ చేశారు.