ఇప్పుడు కాక ఇంకెప్పుడు, యశోద చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా మెప్పించిన చింతా గోపాల కృష్ణారెడ్డి.. కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ చిత్రాన్ని నిర్మించారు. సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడే కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇద్దరు దర్శకులు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే, బాగా హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం కుదిరింది. ఇక కిరణ్ కష్టపడే తత్వం ఉన్న హీరో. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. మే నెలలో కూడా డబుల్ కాల్ షీట్ వర్క్ చేశాడు. డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు. ప్రతి షాట్ రిచ్‌గా వచ్చేందుకు చివరి నిమిషం వరకు కష్టపడ్డారు.
మొదట ‘ఇచ్చోటనే’ అనే టైటిల్ అనుకున్నప్పటకీ ‘క’ అనే పేరు బాగుంది అనిపించింది. టీజర్ రిలీజ్ అవగానే బిజినెస్ కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి.ఇక నేను వ్యాపారవేత్తగా సక్సెస్ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తి, మంచి చిత్రాలు తీయాలనే తపనతోనే ఇండస్ట్రీకి వచ్చా.
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే చిత్రంతో నిర్మాతగా మారాను. ఆ తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ గారితో కలిసి ‘యశోద’కు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించా. ఇప్పుడు కూడా ఆయన నిర్మిస్తున్న ‘సారంగపాణి జాతకం’ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నా. ఒక నిర్మాతగా మంచి సినిమా చేశామనే గుర్తింపు, నా సినిమాను కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా” అన్నారు.
దీపావళి సందర్భంగా లక్కీ భాస్కర్, అమరన్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ ‘క’ గురువారం (అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 29న) హైదరాబాద్ లో జరగగా.. నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం జర్నీకి తాను నంబర్ వన్ అభిమానిని అని ఈ సందర్భంగా చైతన్య ప్రశంసలు కురిపించాడు.