ఊరువాడాలో సంక్రాంతి జోష్ కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి సంబురాలకు కేరాఫ్‌గా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా నడుస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం నుంచి పెద్ద ఎత్తున కోడి పందేలు మొదలయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా పబ్లిక్ భారీ సంఖ్యలో కోడి పందేలకు వెళ్లారు. ఈ రెండు జిల్లాల్లో 420కి పైగా బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. మొత్తం పందేలకు 60 నుంచి 70 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. వీటితో పాటు 300కు పైగా గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ 50 కోట్ల వరకు పందేలు కాసినట్టు సమాచారం. రెండు జిల్లాల మధ్య పోటీగా రోజుకు 20 కోడి పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 3 రోజులు పాటు నిర్వహించే 60 పందేల్లో ఏ జిల్లా ఎక్కువగా గెలుస్తుందో వారికి ఇన్నోవా కారును గిప్ట్గా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పెద్ద బరిలో ఒక్కో పందెం 50 లక్షలకు పైగా నడుస్తోంది. పందేల్లో గెలిచిన వారికి వెండి కాయిన్స్ ఇస్తున్నారు.
కొన్ని చోట్ల వర్షం పడుతుండడంతో బరులు, పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు ప్రత్యేక టెంట్లు వేశారు. మరికొన్ని చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో వీడియోలు తీసుకుంటూ.... వాటిని మొబైల్ ఫోన్లలో షేర్ చేసుకొని ఎక్కడివారక్కడే పందేలు వేసుకుంటున్నారు. పందెం డబ్బులు పేటీఎంలతో ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు. ఇక పందెంలో ఓడిన కోడి ధర 6 వేల నుంచి 10 వేల వరకు పలుకుతోంది. కోడి పందేలు ఆడేందుకు, చూసేందుకు వచ్చిన వారితో తాడేపల్లిగూడెం, తణుకు టౌన్లలోని లాడ్జీలు ఫుల్ అయ్యాయి. మూములు రోజుల్లో వెయ్యి రూపాయలు ఉండే రూమ్ రెంట్ ఇప్పుడు 4 వేల నుంచి 5 వేల వరకు పెరిగింది. రాత్రి టైమ్‌లో పందేలు నడిపేందుకు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.
For More News..