
పులి పేరు చెప్తేనే ఒంట్లో వణుకు మొదలయితది చానామందికి. అలాంటిది పులి ఎదురంగ వస్తే.. కళ్ల ముందటకొచ్చి పంజా విసిరితే.. అమ్మో! తలుచుకుంటేనే గుండె ఆగినంత పనైతది ఎవరికైనా. కానీ, ఈ 66 ఏండ్ల ఎల్ముల శంకర్ మాత్రం పులికి ఇసుమంతైనా బెదరడు. తన గొర్రెల మంద జోలికొస్తే పులినే పరిగెత్తిస్తడు. అలా ఇప్పటికే మూడు సార్లు పులితో పోరాడి గెలిచిండు మంచిర్యాల జిల్లాకి చెందిన శంకర్.
శంకర్‌ది మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఒడ్డుగూడెం. వాళ్ల తాతముత్తాతలు గొర్రెలు కాసేటోళ్లు. ఇప్పుడు శంకర్ కూడా అదే పని చేస్తుండు. ఊరి చివర అడవిలో గొర్రెలు, మేకలు, ఆవులు కాసుకుంట... కుటుంబాన్ని సాదుకుంటుండు. రోజూలానే ఒకరోజు గొర్రెల మందని తోలుకుని అడవికి పోయిండు శంకర్. తోటి కాపర్లతో కలిసి గొర్రెలు కాస్తుంటే.. ఎలుగుబంటి కదలికలు కనపడ్డయ్. క్షణాల్లోనే ఎలుగుబంటి ఎదురంగ వచ్చి నిలబడ్డది. అయినా భయపడలేదు. దాన్ని పరిగెత్తించి ప్రాణాలు కాపాడుకున్నడు.
ఆ తర్వాత కొద్దిరోజులకే పెద్దపులి శంకర్ మేకలపై దాడి చేసింది. అది చూసి ప్రాణ భయంతో మిగతా కాపర్లంతా పరుగులు తీసిన్రు. కానీ, శంకర్ మాత్రం ధైర్యంగా పెద్దపులిని ఎదిరించిండు. దాని నోట్లోంచి తన మేకని గుంజి తీసుకొచ్చిండు. దాన్నుంచి తేరుకునేలోపే మరో పులి తన ఆవు మీద దాడి చేసింది. దాన్ని కాపాడటానికి పోతే శంకర్‌పై విరుచుకుపడింది ఆ పులి. అయినా భయపడకుండా దాన్ని తరిమి కొట్టిండు.
చంపుద్దన్న భయం లేదు
పుట్టిన సంది గొర్రెలు, మేకలే మాకు తిండి పెడుతున్నయ్. వీటితోని వచ్చిన పైసలతోనే మా పిల్లల్ని సాకి, పెండ్లిళ్లు చేసిన. ఈ ముసలితనంలోనూ అవే మాకు అండగా ఉంటున్నయి. అసుంటి వాటికి ఆపతి వస్తే ప్రాణం పోయినట్టు అనిపిస్తది. అందుకే వాటి ప్రాణాలకి నా ప్రాణం అడ్డుపెడతా. పెద్దపులితోనూ పోరాడతా. ఈరోజుకి మేకలకు కడుపునిండ మేపడం తప్ప ఏదైనా జంతువు చంపుద్దన్న భయం లేదు నాకు.
- ఎల్ముల శంకర్