ఉపాధి పరిమాణం అభివృద్ధి స్థాయిపై ఆధారపడుతుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలో ఉత్పత్తి పెరుగుతోంది. ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. మరోవైపు నిరుద్యోగితా పెరుగుతున్నది. దీనికి కారణం సరిపడినన్ని ఉపాధి అవకాశాలు సృష్టించలేకపోవడం. సంస్కరణల తర్వాత వృద్ధిరేటు మెరుగుగా ఉన్నా ఉపాధి వృద్ధిరేటు తక్కువగా ఉంది. అందుకే నిరుద్యోగిత పెరిగింది.
దీనిని జాబ్ లెస్ గ్రోత్ అంటారు. కొన్ని సంవత్సరాల్లో జాబ్ లాస్ గ్రోత్ కూడా కనిపించింది. దేశంలో వృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ ఉపాధి తగ్గింది. ఉదా: 1972–73 నుంచి 1983 మధ్య జీడీపీ వృద్ధి 4.7శాతం కాగా ఉపాధి వృద్ధి 2.4శాతం. 1993–94 నుంచి 2004–05 మధ్య జీడీపీ వృద్ధి 6.3శాతం. ఉపాధి వృద్ధి 1.8శాతం. 2004–05 నుంచి 2011–12 మధ్య జీడీపీ వృద్ధి 8.5శాతం కాగా ఉపాధి వృద్ధి 0.5శాతంగా నమోదైంది. అంటే ఉపాధి వ్యాకోచత్వం నిర్మాణ రంగం మినహాయించి మిగతా రంగాల్లో క్షీణిస్తోంది.
శ్రమశక్తి అంటే పని కోసం ఎదురు చూసే వర్గం. ఉపాధి పొందిన వర్గాన్ని వర్క్ పోర్స్ అంటారు. ఉపాధి పొందని వర్గాన్ని నిరుద్యోగిత అంటారు. ఉపాధి కోసం ఎదురు చూడని వారిని నాట్ ఇన్ ద లేబర్ ఫోర్స్ అంటారు. ఉదా: చదువుకుంటున్న పిల్లలు, వ్యాధిగ్రస్తులతో బాధపడేవారు, అంగవైకల్యం గలవారు, ఇంటి పని నిర్వహించేవారు దీనికిలోకి వస్తారు.
ఉపాధి నిర్మాణం
రంగాలవారీ ఉపాధి పంపిణీ, వ్యవస్థీకృత రంగంలో ఉపాధి, ప్రైవేట్ రంగంలో ఉపాధి పరిశీలించాల్సి ఉంది.
అవ్యవస్థీకృత రంగం
వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొన్న చిన్న యూనిట్లను అవ్యవస్థీకృతరంగంగా గుర్తిస్తారు. అయితే వీటి కార్యకలాపాలను ప్రభుత్వాధికారులు గుర్తించరు. రికార్డు చేయరు. క్రమబద్దీకరించరు. ఉదా: బూట్లు పాలిష్ చేయడం, ఆహార ప్రక్రియ, చెత్తను తీసుకెళ్లడం, రోడ్లపై వస్తువులు విక్రయించడం మొదలైన నైపుణ్యం అవసరం లేని, తక్కువ పెట్టుబడి అవసరం అయ్యేవి. అదేవిధంగా టైలరింగ్, ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్ చేయడం వంటి కొంత నైపుణ్యం, పెట్టుబడి అవసరమయ్యే పనులు కూడా ఈ రంగంలోకి వస్తాయి. ప్రభుత్వ రంగంలో గల సంస్థలు ప్రైవేట్ రంగంలో 10 లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధిని అందించే సంస్థలు ఆర్గనైజ్డ్ రంగంలోకి వస్తాయి. వీటికి అనుబంధంగా ఉన్నవన్నీ అన్ఆర్గనైజ్డ్ రంగంలోకి వస్తాయి. అనీయిత, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారికి తక్కువ వేతనాలు, ఆదాయ భద్రత లేకపోవడం, ఎక్కువ పనిగంటలు, సెలవులు లేకపోవడం, సాంఘిక భద్రత లేకపోవడం, పని పరిస్థితులు మెరుగు లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగం
మొత్తం ఉపాధిలో ప్రభుత్వ రంగం వాటా 1991 నాటికి పెరిగింది. సంస్కరణల తర్వాత ప్రభుత్వ రంగంలో ఉపాధిని తగ్గించడంతో దీని వాటా 2012 నాటికి 59.6శాతానికి తగ్గింది. ప్రభుత్వ, ప్రైవేట్ రెండు రంగాలు కలిపి సంస్కరణలకు ముందు 1.20 ఉపాధి వృద్ధిరేటును కలిగి ఉన్నాయి. సంస్కరణల తర్వాత 0.46శాతానికి పడిపోయింది. అయితే విడివిడిగా పరిశీలిస్తే సంస్కరణలకు ముందు ప్రభుత్వ ఉపాధి వృద్ధి 1.53శాతం, సంస్కరణల తర్వాత ప్రభుత్వరంగ ఉపాధి వృద్ధి రుణాత్మక (–0.36శాతం)కు చేరింది. ప్రైవేట్‌రంగ ఉపాధి వృద్ధి సంస్కరణలకు ముందు 0.44శాతం కాగా సంస్కరణల తర్వాత 2.03శాతానికి పెరిగింది.
రోజువారీ ఉపాధి పెరగడం
2011–12 వరకు దేశంలో రోజువారీ కూలీల శాతం పెరుగుతూ వస్తోంది. గ్రామాల్లో పెరిగే శ్రామిక జనాభాకు, వ్యవసాయం ఉపాధి కల్పించలేకపోయింది. అందుకే ప్రజలు వ్యవసాయేతర రంగాలైన నిర్మాణం, వర్తకం, సేవలు వంటి రంగాల్లోకి తరలిపోతున్నారు. ముఖ్యంగా ఉపాంత చిన్న రైతులు వ్యవసాయంలో సరైన ఉపాధి లేక వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఏదో పనిలోకి చేరిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంస్థలు కూడా శాశ్వత ఉద్యోగులను తీసివేయడం వల్ల రోజువారీ కూలీలు పెరుగుతున్నారు.
గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింది నిర్మాణం రంగంలో ఉపాధి పెరగడం వల్ల పట్టణాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి వల్ల ఈ రోజువారీ కూలీల శాతం పెరిగింది. 2011–12లో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్లో స్త్రీ, పురుషులు ఎక్కువగా స్వయం ఉపాధిలో నిమగ్నమై ఉన్నారు. రెండో స్థానంలో రోజువారీ శ్రామికులు ఉన్నారు. రోజువారీ శ్రామికుల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. రెగ్యులర్ ఉపాధిలో స్త్రీల కంటే పురుషుల శాతం ఎక్కువగా ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే స్వయం ఉపాధి, రోజువారీ శ్రామికులు పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువ శాతం ఉంది. రెగ్యులర్ ఉపాధి గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది. మొత్తం మీద 2011–12లో మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి 52శాతం, రెగ్యులర్ ఉపాధి 18శాతం, రోజువారీ ఉపాధి 30శాతం ఉంది.