మూడో ప్రపంచ దేశాలంటే మీకు తెలుసా?

మూడో ప్రపంచ దేశాలంటే మీకు తెలుసా?

పేద దేశాలను పలు పేర్లతో పిలుస్తారు. వెనుకబడిన దేశాలు, అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ ఆదాయం గల దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అని పలు పేర్లతో వర్ణిస్తున్నారు. అయితే, ఐక్యరాజ్యసమితి ప్రచురణ మాత్రం అల్పాభివృద్ధి దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్ణిస్తున్నది. యూఎన్​ఓ ప్రకారం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఐరోపా దేశాల వాస్తవ తలసరి ఆదాయం కంటే ఏ ఆర్థిక వ్యవస్థల తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందో వాటిని అల్పాభివృద్ధి దేశాలు అంటారు. 

సాధారణంగా అమెరికా వాస్తవ తలసరి ఆదాయంలో 1/4 వంతు కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలను అల్పాభివృద్ధి దేశాలు అంటారు. ఈ దేశాలు తక్కువ తలసరి ఆదాయం, వ్యవసాయరంగ ఆధిక్యత, అధిక జనాభా ఒత్తిడి, నిరుద్యోగిత, మూలధన కొరత, ఆదాయ అసమానతలు, అల్ప సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మానవ అభివృద్ది, వనరుల అల్ప వినియోగం, తక్కువ జీవన ప్రమాణ స్థాయితో ఉంటాయి. 

తక్కువ తలసరి ఆదాయం: అల్పాభివృద్ధి దేశాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. తక్కువ తలసరి ఆదాయం వల్ల అల్పజీవన ప్రమాణం, అపౌష్టిక ఆహారం, అపరిశుభ్రత ఏర్పడి వ్యాధులు పెరిగి ఆయుర్ధాయం తగ్గుతుంది. ప్రపంచ బ్యాంకు అంచనాల 2020 ప్రకారం అధిక ఆదాయం గల దేశాల సగటు తలసరి ఆదాయం 44,479 అమెరికా డాలర్లు, అల్ప ఆదాయం గల దేశాలు సగటు తలసరి ఆదాయం 669 డాలర్లు.

ఈ రెండింటి మధ్య ఆదాయ అసమానతలు ఎక్కువ ఉండుటయే కాకుండా పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థలో అల్పాభివృద్ధి లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2020 ప్రకారం భారత తలసరి ఆదాయం వినిమయ రేటులో 1920 డాలర్లు. దీని కంటే అమెరికా తలసరి ఆదాయం 33 రెట్లు ఎక్కువ. కొనుగోలు శక్తి సమానత(పీపీపీ) ప్రకారం భారత తలసరి ఆదాయం 6440 డాలర్లు. దీని కంటే అమెరికా తలసరి ఆదాయం 10 రెట్లు ఎక్కువ. అయితే వినిమయ రేటు కంటే పీపీపీ ప్రకారం దేశాల మధ్య తలసరి ఆదాయ వ్యత్యాసాలు తక్కువగా ఉన్నాయి. 

వ్యవసాయరంగ ఆధిక్యత: అల్పాభివృద్ధి దేశాల్లో జాతీయ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా సగం కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఉపాధిలో 3/4 వంతు వ్యవసాయరంగంపై ఆధారపడుతుంది. విదేశీ వ్యాపారంలో ప్రాథమిక రంగం నుంచి ఎక్కువ ఎగుమతులుంటాయి. గాల్​బ్రెత్ ప్రకారం పూర్తి వ్యవసాయ దేశాలు, వ్యవసాయంలో అంత పురోగతిని సాధించలేవు.

అల్ప సాంకేతిక పరిజ్ఞానం, పురాతన పద్ధతులు అవలంబిస్తారు. జనాభా ఒత్తిడి వల్ల కమతాల విఘటన జరుగుతుంది. ఉపాధిలో వాటా కంటే జాతీయాదాయంలో వ్యవసాయరంగ వాటా తక్కువగా ఉంటుంది. ఇది వ్యవసాయరంగ తలా ఒక్కొక్క శ్రామికుని తక్కువ ఉత్పాదకతను సూచిస్తుంది. వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉండటంతో తమ ఆదాయంలో ఎక్కువ భాగం, వ్యవసాయ ఉత్పత్తులపై ఖర్చు పెడతారు. 

ఫలితంగా పారిశ్రామిక రంగం వెనుకబడుతుంది. అదే ఇంగ్లాండ్​లో అయితే జాతీయాదాయంలో వ్యవసాయం వాటా 1శాతంగాను, ఉపాధిలో వ్యవసాయరంగం అందించేది 1శాతంగాను ఉంది.భారతదేశాన్ని పరిశీలిస్తే జాతీయదాయంలో వ్యవసాయరంగం వాటా 1950–51లో 55శాతంపైనే వచ్చేది. 2021–22 నాటికి 18శాతానికి తగ్గింది. మొత్తం శ్రామిక జనాభాలో వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభాను పరిశీలిస్తే 1951లో 72శాతం కాగా, 2011 జనాభా లెక్కల నాటికి 54.6శాతం ఆధారపడ్డారు.  

అధిక జనాభా ఒత్తిడి: ఈ దేశాలు అధిక జనాభావృద్ధి రేటును కలిగి ఉంటాయి. జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశలో ప్రవేశించి ఉంటాయి. మరణరేటు తగ్గించడంలో విజయవంతంకాగలిగాయి. కాని అదే వేగంతో జననరేటును తగ్గించలేదు. అల్పాభివృద్ధి దేశాల్లో జనాభా వార్షిక వృద్ధిరేటు 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

వైద్య సౌకర్యాలు విస్తరించడం వల్ల మరణ రేటు తగ్గినా పేదరికం, అజ్ఞానం, మూఢనమ్మకాల వల్ల జననరేటు ఇంకా అధికంగానే ఉంటుంది. అల్ప మరణరేటు, అధిక జనన రేటు వల్ల జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనుత్పాదక జనాభా పెరిగి, ఆధారపడేవారి శాతం పెరిగి, తిరిగి జీవన ప్రమాణాలు పడిపోతాయి. ఈ దేశాల్లో అధిక జనాభావృద్ధి అనేది అల్పాభివృద్ధికి కారణం, ఫలితం కూడా. ఒక దేశంలో వార్షికంగా జనాభా 2శాతం చొప్పున పెరిగితే, తలసరి ఆదాయం స్థిరంగా ఉండాలంటే జీఎన్​పీ కూడా వార్షికంగా 2 శాతం చొప్పున పెరగాలి. 

సీఓఆర్​ 4:1 అని భావిస్తే, జీఎన్​పీ వార్షికంగా 2శాతం చొప్పున పెరగాలంటే పెట్టుబడి రేటు 8శాతం ఉండాలి. తలసరి జీఎన్​పీ 6శాతం పెరగాలని ఆ దేశం భావిస్తే పెట్టుబడి 32శాతం ఉండాలి. భారతదేశం 1921 నుంచి జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశలోకి ప్రవేశించింది. 1911–21 దశాబ్దంలో భారత్​లో జననరేటు 49గాను, మరణరేటు కూడా 49గానే ఉంది. ఎస్​ఆర్​ఎస్​ 2020 ప్రకారం జనన రేటు 19.5శాతం, మరణ రేటు 6.0శాతం. 2001–11 మధ్య దశాబ్ద జనాభా వృద్ధిరేటు 17.7శాతం, సాంవత్సరిక జనాభా వృద్ధిరేటు 1.6శాతం.

నిరుద్యోగిత: అమలులో ఉన్న వేతనం వద్ద పనిచేయాలనే కోరికతోపాటు పని చేయగలిగే శక్తి కూడా ఉన్నా పని లభించని పరిస్థితిని నిరుద్యోగిత అంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనై చ్ఛిక నిరుద్యోగిత ఉంటుంది. ముఖ్యంగా నైపుణ్యం లేని వారిలో ఎక్కువగా ఉంటుంది. పేదరికం వల్ల పారిశ్రామిక వస్తువులకు తక్కువ డిమాండ్​ ఉండటంతో పారిశ్రామిక రంగం విస్తరణకు అవకాశం తక్కువ ఉంటుంది. ఫలితంగా తక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంప్రదాయ వ్యవసాయం వల్ల తక్కువ ఉత్పాదకత ఉండటంతో శ్రామిక శోచన శక్తి తక్కువ ఉంటుంది. ప్రత్యామ్నాయ ఉపాధి లేక, జనాభా ఒత్తిడి వల్ల ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా ఉంటుంది. 

మూలధనం కొరత: వెనుకబడిన దేశాల్లో ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల పొదుపు సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా మూలధనం కొరత ఏర్పడుతుంది. అల్పాభివృద్ధి దేశాల్లో జీడీపీలో పొదుపు రేటు 20శాతం కంటే తక్కువగా ఉంది. రాగ్నార్​ నర్క్స్​ పేర్కొన్నట్లు అల్పాభివృద్ధి దేశాల్లో పేదరిక విషవలయాల వల్ల పొదుపు సామర్థ్యం తక్కువ. డిమాండ్​ వైపు కూడా పరిమిత మార్కెట్​ వల్ల పొదుపు చేసేవారికి ప్రోత్సాహం ఉండదు. 

షుంపీటర్​ పేర్కొన్నట్లుగా, ఆర్థికాభివృద్ధికి అవసరమైన చొరవతో ముందుకు వచ్చే వ్యవస్థాపకులు కొరత వల్ల కూడా పెట్టుబడి స్థాయి తక్కువగా ఉంటుంది. కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, బాటకం రూపంలో ఆదాయం వచ్చినా వారు ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు గాని, పొదుపు చేసి పెట్టుబడి పెట్టరు. భారతదేశంలో తక్కువ ఆదాయం వల్ల, అధిక వినియోగ వ్యయం వల్ల పొదుపు స్థాయి తక్కువగా ఉంది. 

మన దేశంలో తలసరి మూలధన లభ్యత తక్కువగా ఉంది. ప్రస్తుత మూలధన కల్పన రేటు కూడా తక్కువగా ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో మూలధన కల్పన రేటు పెరిగింది. ఇది కోరదగిన అభివృద్ధిగా చెప్పవచ్చు.1959–61 జీడీపీలో పొదుపు శాతం 8.6శాతంగా ఉండేది. 2007–08లో గరిష్టంగా 36.8శాతం2019–20లో 31.4శాతానికి చేరింది. స్థూల దేశీయ పొదుపునకు ప్రభుత్వరంగం, కార్పొరేట్​ రంగం, గృహరంగం నుంచి పొదుపు వనరులు లభ్యమవుతున్నాయి. వీనిలో ఎక్కువ భాగం గృహరంగం నుంచి లభిస్తుంది. 

వనరుల అల్పవినియోగం: అల్పాభివృద్ధి దేశాల్లో వనరులను ఉపయోగించకపోవడం గాని, అల్ప వినియోగం గాని జరుగుతుంది. మూలధనం కొరత వల్లగాని, నూతన సాంకేతిక పద్ధతులు వాడకపోవడం వల్లగాని,  పరిమిత మార్కెట్​ వల్లగాని, ఈ దేశాల్లో ఉన్న వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేవు. 

తక్కువ జీవన ప్రమాణ స్థాయి: ఈ దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు పేదరికం, అపౌష్టిక ఆహారం, వ్యాధులు, నిరక్షరాస్యతతో బాధపడుతూ అల్పజీవన ప్రమాణం కలిగి ఉంటారు. మనదేశంలో కూడా ఈ లక్షణం కనపడుతుంది. మన ఆహారం మాంసకృత్తులు విలువ తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు 3400 కాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోగా, 1999 నాటికి మన దేశంలో 2496 కాలరీలు సగటున లభ్యమవుతున్నాయి.