కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారు ఇండియాలో ఓ ప్రాంతానికి వెళ్లారంటే పస్తులుండాల్సిందే.. ఆ గ్రామంలో కనీసం గుడ్లు కూడా దొరకవట. అంతేకాదు పక్క గ్రామం నుంచి తీసుకెళ్లి అక్కడ తిన్నా ఇక వారు జైలుకు వెళ్లాల్సిందే... ఫైన్ కట్టాల్సిందే.. ఆ గ్రామం ఎక్కడో కాదండోయ్.. మన దేశంలోనే ఉంది. ప్రపంచలోనే తొలి శాఖాహారంగా నిలిచిన ఆ నగరం ఎక్కడుంది..? ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం...
ప్రతి గ్రామం, పట్టణంలో శాఖాహారులు, మాంసాహారులు ఉంటారు. కానీ కొంతమంది కేవలం శాఖాహారం మాత్రమే తింటారు. కానీ గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరంలో మాత్రం అందరూ శాఖాహారం మాత్రమే తింటారు. నగరంలోని హోటల్స్‌లో కూడా మాంసాహారాన్ని నిషేధించారు. అంతేకాదు అక్కడ.. గుడ్లు, మాంసం అమ్మినా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారట. మరి నగరానికి నగరమే శాఖాహారంగా మారిందంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఆ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంటే గానీ.. మాంసాహారంపై నిషేధం విధించడం సాధ్యపడదు.
భారతదేశంతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో శాఖాహారంతో పాటు మాంసాహారం భుజించే వారు అధికంగా ఉంటారు. మాంసాహార ప్రియులు తమ వారం మెనూ ముక్కలు ఉండేలా చూసుకుంటారు. శాఖాహారం తిన్నవారంతా ఒకరోజు మాంసాహారం తినేందుకు ఆసక్తి చూపుతారు. అందుకే ఆర్థిక వ్యవస్థలో మాంసాహార మార్కెట్ కు ప్రాధాన్యం ఉంది. మాంసాహారంతో పాటు దాని అనుబంధంగా మిగతా వ్యాపారాలు కూడా కొనసాగుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా మాంసాహారం తినే దేశంలో భారతదేశం టాప్ లోనే ఉంటుంది. అలాంటి భారతదేశంలోనే ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరం ఒకటి ఉంది. అయితే ఆ నగరం ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరంగా గుర్తింపు పొందడం విశేషం.
గుజరాత్ రాష్ట్రంలో అత్యధికంగా హిందువులు ఉంటుంటారు. (మార్వాడీలు) - జైనులు - ఇతర మతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఉంటారు. అయితే జైనమతస్తులు శాఖాహారులు. వారు జంతుహింసను ప్రోత్సహించరు. చివరకు చీమలు - క్రిములు కూడా నోటిలోకి వెళ్తే జంతుబలి చేసినట్లు అని భావించి నోటికి గుడ్డ కట్టుకుంటారు. అలాంటి వారు నివసించే నగరం ‘పాలిటానా’. జైనులకు ఆ నగరం ఎంతో స్వచ్ఛంగా.. పవిత్ర - క్షేత్రంగా పరిగణిస్తున్నారు. ఈ నగరంలో జంతువులను చంపడం చట్ట విరుద్ధం. గుడ్లు - మాంసం విక్రయాలు కూడా నిషేధించారు.
ఇక జైనులు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. అయితే 2014 వరకు పాలిటానాలో మాంసంతో పాటు కోడిగుడ్లను విక్రయించేవారు. నగరంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు కూడా బాగానే ఉండేవి. అయితే జైనులకు అతిపెద్ద తీర్థయాత్ర కేంద్రంగా గుర్తింపు పొందిన పాలిటానాలో గుడ్లు, మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. 2014 జూన్‌లో 200 మంది జైనులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష నాలుగు రోజుల పాటు కొనసాగింది. జైనుల దీక్షను గమనించిన గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటానాను మీట్ ఫ్రీ జోన్‌గా ప్రకటించారు. మాంసం, గుడ్లు, జంతు వధపై పూర్తిగా నిషేధం విధించారు. చేపల వేటకు కూడా అనుమతి లేదు. దీంతో పాలిటానా ప్రపంచంలోనే తొలి శాఖాహార నగరంగా అవతరించింది. అయితే, పాల ఉత్పత్తుల అమ్మకం లేదా వినియోగంపై నిషేధం లేదు. పదేండ్ల నుంచి పాలిటానా శాఖాహార నగరంగా కొనసాగుతోంది.
ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం 250 మాంసాహార దుకాణాలను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ నగరంలో మాంసం ఎక్కడా కనిపించడం లేదు. పూర్తి శాఖాహార ప్రాంతంగా గుర్తించారు. కేవలం అక్కడ పాల ఉత్పత్తులను మాత్రమే అనుమతించారు. అక్కడి ప్రజలు పాలు - నెయ్యి - వెన్న మొదలైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రాంతంలో వందలాది దేవాలయాలు ఉండడంతో కూడా ఈ ప్రాంతాన్ని దైవ నిలయంగా భావిస్తూ పాలిటానాలో మాంసాహారం బంద్ చేయించారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం ప్రపంచంతోపాటు దేశంలోనే తొలి శాఖాహార నగరంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు శత్రుంజయ కొండపై ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అధినాథ్ (రిషభదేవుడు) కి అంకితం ఈయబడింది. శత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది. దీనిని 11 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరంలో జైన తరాలవారు నిర్మించారు. గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలో పాలిటానా ఉంది. ఈ ప్రాంతం జైనులకు గౌరవప్రదమైన గమ్యస్థానం. శత్రుంజయ కొండల చుట్టూ ఉన్న ఈ నగరానికి జైన్ టెంపుల్ టౌన్ అని కూడా పేరుంది. పాలిటానాలో మొత్తం 823 జైనుల ఆలయాలు ఉన్నాయి. 24 తీర్థంకరులకు లేదా జైన మతంలోని పవిత్ర సాధువులకు అంకితం చేయబడిన ప్రధాన పుణ్యక్షేత్రంగా పాలిటానా ప్రసిద్ధి చెందింది.