చెట్లకు చిన్న గాటు పడినా, చెట్లని చీడపురుగులు తినేస్తున్నా తట్టుకోలేరు ప్రకృతి ప్రేమికులు. వాటికి మునుపటిలా జీవం తెచ్చేదాకా కష్టపడతారు. దొబ్బల ప్రకాష్ కూడా అదే కోవకి చెందుతాడు. మోడువారిన వందల ఏండ్ల నాటి చెట్టుకి జీవం ఇచ్చాడు.
పోయిన అక్టోబర్‌లో భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని కాలువ గట్టున ఉన్న మర్రి చెట్టు నేలకూలింది. వరద ధాటికి మర్రిచెట్టు దాదాపు వేళ్లతో సహా నేలకొరిగింది. రెండు నెలల్లో పూర్తిగా ఎండిపోయింది. వందల ఏండ్ల నాటి ఆ మర్రిచెట్టు అలా ఎండిపోవడం చూసి దొబ్బల ప్రకాశ్ తట్టుకోలేకపోయాడు. ఆ చెట్టుని మునుపటిలా పచ్చని చిగురుతో చూడాలి అనుకున్నాడు.
రెండు నెలల్లో చిగురు..
అనుకున్నదే తడవు ఆ చెట్టుకి దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావి నుండి చెట్టు వరకు నీళ్ల పైప్ లైన్ వేయించాడు. చెట్టు వేర్ల దగ్గర ఉన్న చెత్తాచెదారాన్ని తీసి శుభ్రం చేశాడు. రోజూ ఉదయం, సాయంత్రం చెట్టుకు నీళ్లు పట్టడం మొదలుపెట్టాడు. అతని కష్టం ఫలించి, రెండు నెలల్లోనే చెట్టు చిగుర్లు వేసింది. ఈ చెట్టుని మరోచోటకు ట్రాన్స్‌లొకేట్ చేసి, శాశ్వతంగా బతికించాలనే ఆలోచనతో ఉన్నాడు ప్రకాష్.
ఎండిపోవడం చూడలేక
కొన్నేండ్లుగా ఎందరికో నీడనిచ్చిన, ఎన్నో పక్షులకి గూడు అయిన మర్రిచెట్టు మోడుబారడం చూసి కలత చెందాను. ఎలాగైనా ఈ మర్రి చెట్టుకు ప్రాణం పోయాలనుకున్నాను. రెండు నెలలు నీళ్లు పట్టిన తర్వాత పచ్చగా చిగురు తొడిగింది. దాంతో నాకు ఈ మర్రి చెట్టును కాపాడొచ్చనే నమ్మకం కుదిరింది.
– దొబ్బల ప్రకాష్
సోషల్ మీడియాతో..
ట్రాన్స్‌లొకేట్ చేయడానికి చాలా ఖర్చవుతుందని తెలిసి, ‘ఎవరైనా సాయం చేస్తే బాగుండ’ని... ఎండిపోయిన చెట్టు, చిగురు తొడిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రకాష్. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. వాటా ఫౌండేషన్ ఆ చెట్టును తరలించే బాధ్యత తీసుకుంది. చెట్టు ఉన్న దగ్గరికి వంద టన్నుల క్రేన్ తీసుకెళ్లేందుకు రోడ్డు వేసే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలోనే మర్రిచెట్టును ఊళ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌కు తీసుకెళ్తాం అంటున్నాడు ప్రకాశ్.
– మేడి కిషన్, సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు