
- కొట్టి, తన్ని, ఈడ్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
- మధ్యప్రదేశ్‌లో భార్య వైద్యం కోసం వచ్చిన వృద్ధుడిపై దాష్టీకం
- పేషెంట్ల ఆగ్రహంతో పారిపోయిన డాక్టర్
ఛాతర్‌పూర్: భార్య వైద్యం కోసం వరుసలో నిల్చున్న 77 ఏండ్ల వృద్ధుడిపై ఓ డాక్టర్దారుణంగా దాడికి పాల్పడ్డాడు. అతన్ని కొడుతూ నేలపై పడేసి ఈడ్చుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈనెల 17న ఉద్దవ్ లాల్ జోషి అనే 77 ఏండ్ల వృద్ధుడు తన భార్యకు కడుపులో నొప్పిగా ఉంటే ఛాతర్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పేషెంట్లను చూస్తున్న డాక్టర్ ముందు అప్పటికే చాలా మంది క్యూలో ఉన్నారు. ఉద్దవ్ వెళ్లి ఆ వరుసలో నిల్చున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న పేషెంట్లను చూసి అప్పటికే చిరాకుపడుతున్న డాక్టర్ఉద్దవ్ను క్యూలో ఎందుకు నిల్చున్నావని అడిగాడు. ఉద్దవ్ తను ఎందుకు వచ్చింది చెప్తుండగా డాక్టర్ వచ్చి అతన్ని చెంపదెబ్బ కొట్టారు. తర్వాత అతన్ని దెబ్బలు కొడుతూ కింద పడేసి తంతూ.. షర్ట్ పట్టుకొని ఈడ్చుకుంటూ ఆసుపత్రి ఆవరణలోని పోలీసు అవుట్‌పోస్ట్ వద్దకు లాక్కెళ్లాడు. ఇది చూసి అక్కడే పలువురు పేషెంట్లు డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డాక్టర్ అక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు. ఇదంతా అక్కడున్న కొందరు వీడియోలు తీశారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డాక్టర్ దాడిలో తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని ఉద్దవ్ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్రీట్మెంట్ కోసం రాయించుకున్న స్లిప్ కూడా చించేశాడని, చంపేస్తానని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై ఛాతర్‌పూర్ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ జీఎల్ అహిర్వార్ మాట్లాడుతూ గురువారం ఈ ఘటన జరిగిందని అంగీకరించారు. ‘‘ముందుగా వృద్ధుడే అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు డాక్టర్ నాకు చెప్పాడు. అయితే, ఆ డాక్టర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఆయన తీరు సిగ్గుచేటు. దీనిపై వెంటనే డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాం. ఆ డాక్టర్‌కు నోటీసు కూడా ఇచ్చాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం” అని అహిర్వర్ అన్నారు.