ఆ దేవుడి తర్వాత మనమంతా ఎవరికైనా ముక్కుకుంటామంటే అది ఒక్క వైద్యుడికి మాత్రమే అని చెప్పాలి. చావు బతుకుల్లో ఉన్నవారిని డాక్టర్లు బతికించిన సంఘటనలు చాలా చూశాం. తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ చేసి సాయి అనే ఆరేళ్ళ బాలుడి ప్రాణం కాపాడింది రవళి అనే డాక్టర్. ఈ నెల 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆడుకుంటూ విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు సాయి.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిని తల్లిదండ్రులు భుజం మీద వేసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తుండాగా అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి గమనించింది. విషయాన్ని తెలుసుకున్న రవళి బాలుడిని రోడ్డుపైనే పడుకోబెట్టి CPR చేసింది . సుమారు 7నిమిషాల పాటు సీపీఆర్ చేసి బాలుడి ఆయువును నిలిపింది రవళి. సీపీఆర్ తర్వాత బాలుడితో కదలిక రావటంతో దగ్గరలోని ఓ ప్రైవెట్ హాస్పిటల్ కి తరలించగా పూర్తిగా కోలుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విర్రల్ గా మారింది. రవళి చూపిన సమయస్ఫూర్తికి, తన అప్రమత్తతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.