జాగ్రత్త: ఉడకని మాంసం తింటున్నారా..! శరీరంలో జరిగేది ఇదే!

 జాగ్రత్త: ఉడకని మాంసం తింటున్నారా..! శరీరంలో జరిగేది ఇదే!

మాంసాన్ని బాగా ఉడికించి తినాలని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. ఉడకని ఆహారం ఆరోగ్యానికి మంచిదికాదని 'సిస్టిసెర్కోసిస్' బారిన పడతారని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనకు అవేమీ పట్టవు. ఆకలేసినప్పుడల్లా ఆవురావురమని తినేస్తూ ఉంటాం. అలా తినేసే ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. 

తన ఒంట్లో ఏదో నలతగా ఉందంటూ ఓ వ్యక్తి ఆస్పత్రి మెట్లెక్కాడు. 'చూడటానికి బాగానే ఉన్నావ్.. నీకేం జబ్బులు ఉంటాయయ్యా' అని ప్రశ్నించిన వైద్యులు.. సరే ఓసారి CT స్కాన్‌ చేసి చూద్దామని అతనికి టెస్టులు చేశారు. అంతే ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అతంటి ఒంటినిండా పురుగులు(పరాన్నజీవులు) పాముల్లాగా పాకుతున్నాయి. ఆ అనుభవాన్ని ఓ  వైద్యుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

ఉడకని పంది మాసం తినడం వల్ల..

క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో మెడికల్ కేస్ స్టడీస్‌ని పంచుకునే ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ సామ్ ఘాలి ఇటీవల 'సిస్టిసెర్కోసిస్ ఇన్ఫెక్షన్’‌తో బాధపడుతున్న వ్యక్తి తాలూకా కేసు వివరాలను వెల్లడించారు. CT స్కాన్‌లో రోగి కాళ్లు కండరాలలో పోర్క్ టేప్‌వార్మ్ లార్వా పాకుతున్నాయి. రోగి సరిగ్గా ఉడకని పంది మాసం పదే పదే తినడం వల్ల ఈ వ్యాధి బారిన పడినట్లు ఘాలి వివరించారు.

ఆహారాన్ని తీసుకున్న 5 నుండి 12 వారాల తర్వాత లార్వా జీర్ణశయ ప్రేగులలో పరిపక్వ వయోజన టేప్‌వార్మ్‌లుగా పరిణామం చెందుతాయని డాక్టర్ సామ్ వెల్లడించారు. దీనిని ఇంటెస్టినల్ టైనియాసిస్ అని పిలుస్తారని చెప్పారు. కొన్ని సంధర్భాల్లో ఈ టేప్‌వార్మ్‌లు మెదడుకు ప్రయాణించి, మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. తద్వారా విపరీతమైన తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, ఇతర నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని డాక్టర్ ఘాలి వివరించారు. కావున మాసం ఏదైనా బాగా ఉడికించి తినాలని మాంసప్రియులకు సూచించారు. మీరు కూడా రోడ్ల వెంట తినే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండగలరని మనవి.