- గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఘటన
భావ్‌నగర్: ఎమర్జెన్సీ రూంలోకి వచ్చిన రోగి బంధువులను.. చెప్పులు బయట విడిచి రావాలని చెప్పినందుకు డాక్టర్‌పై దాడి చేశారు. గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తలకు గాయం కావడంతో భావ్‌నగర్‌లోని సిహోర్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎమర్జెన్సీ రూంలో ట్రీట్మెంట్తీసుకుంటోంది.
గత శనివారం ఆమెను చూసేందుకు కొందరు బంధువులు ఆస్పత్రికి వచ్చారు. వారు చెప్పులు వేసుకొని నేరుగా ఎమర్జెన్సీ రూంలోకి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్ వారిని చెప్పులు గది బయట విడిచి రావాలని సూచించాడు. అందుకు వారు ఒప్పుకోకపోవడమే కాకుండా డాక్టర్‌తో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ముగ్గురు వ్యక్తులు డాక్టర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ట్రీట్మెంట్తీసుకుంటున్న మహిళతో పాటు గదిలో ఉన్న నర్సింగ్ సిబ్బంది సైతం వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. డాక్టర్ -జైదీప్ సిన్హ్ గోహిల్ ఫిర్యాదు మేరకు నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాను పోలీసులు అరెస్టు చేశారు.