వివాహితతో సరోగసికి ఓ వ్యాపారి ఒప్పందం
మాట మార్చి సహజీవనం చేసి కనాలని ఒత్తిడి
పోలీసులకు మహిళ ఫిర్యాదు.. వ్యాపారి అరెస్టు
హైదరాబాద్ (పంజాగుట్ట), వెలుగు: ఆ ముసలాయనకు 64 ఏండ్లు. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కానీ కొడుకు కావాలనుకున్నాడు. సరోగసి ద్వారా కనేందుకు ఓ వివాహితతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మాట మార్చి సరోగసి కాదు.. సహజీవనం చేసి బిడ్డను కనాలని ఒత్తిడి చేశాడు. వేధించాడు. బెదిరించాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్టు చేశారు.
రూ. 4.5 లక్షలకు ఒప్పందం
స్వరూప్రాజు సోమాజిగూడ వాసి. వ్యాపారం చేస్తుండేవాడు. ముగ్గురు ఆడ పిల్లలున్నారు. కానీ కొడుకు కావాలని ఎప్పటి నుంచో అనుకుంటుం డగా ఫ్రెండ్స్ ద్వారా సరోగసి విషయం తెలిసింది. వెంటనే ఏజెంట్ నూర్‌ను కలిశాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిలకలగూడకు చెందిన ఓ వివాహిత సరోగసికి ఒప్పుకుంది. నూర్ సాయంతో రూ.4.5 లక్షలకు ఆమెతో రాజు అగ్రిమెంట్చేసుకున్నాడు. డెలివరీ వరకు ప్రతి నెల రూ. 10 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దీని కోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే కొద్ది రోజుల తర్వాత స్వరూప్‌రాజ్ మాట మారింది. సరోగసి ద్వారా కాకుండా తనతో సహజీవనం చేసి బిడ్డను కనాలని స్వరూప్రాజు ఆమెపై ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. అందుకు రూ. 50 వేలు ఎక్కువ ఇస్తానన్నాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు. బెదిరించాడు. వేధించాడు. దీంతో బాధిత మహిళ విషయం తన భర్తకు చెప్పి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు స్వరూప్ రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.