ఆరు హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సులకు కరోన
ఎమర్జెన్సీకి వచ్చే అనుమానితుల నుంచే వ్యాప్తి
నిమ్స్‌లో స్టాఫ్ నర్సు, ఆయాకు వైరస్
నిలోఫర్ లో వైరస్ తో బాబు మృతి.. క్వారంటైన్ లోకి స్టాఫ్
డాక్టర్లు, హెల్త్ సిబ్బందికి హోటళ్లలో బస
కుటుంబ సభ్యులకు సోకకుండా సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కరోనాపై పోరాటంలో ముందున్న హెల్త్ సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు వస్తున్న పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసే క్రమంలో కరోనాకు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని ఆరు దవాఖానాలకు చెందిన కొందరు హెల్త్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా నలుగురు వైద్యారోగ్యశాఖ సిబ్బంది సహా మొత్తం 15 మంది హెల్త్ స్టాఫ్ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా నిమ్స్‌హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆపరేషన్ థియేటర్‌లో పనిచేసే స్టాఫ్‌నర్సు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ ఆయమ్మకూ వైరస్ సోకింది. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఆయాకు వైరస్ అంటుకోగా.. స్టాఫ్ నర్సుకు ఎలా సోకిందన్నది తెలియాల్సి ఉంది. ఇక నిలోఫర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ పొందిన ఓ రెండు నెలల బాబుకు వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి అడ్మిటైన రోజు రాత్రి నుంచి తర్వాతి రెండ్రోజుల వరకూ డ్యూటీలో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ అంతా క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండ్రోజుల కింద గాంధీ హాస్పిటల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు, అక్కడ డ్యూటీ చేసిన కానిస్టేబుల్ వైరస్ బారినపడ్డారు.
ఇంటికెళ్లకుండా హోటళ్లలో వసతి
కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు తొలుత కార్పొరేట్ హాస్పిటళ్లను కూడా ప్రభుత్వం అనుమతించింది. అలాగే కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటల్స్‌లోనూ ట్రీట్‌మెంట్ అందించారు. తర్వాత పాజిటివ్ వ్యక్తులందరినీ గాంధీకే తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడే వందల మంది
పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరోనా అనుమానితులను కింగ్ కోఠి, చెస్ట్, ఉస్మానియా హాస్పిటల్‌లో తాత్కాలికంగా ఐసోలేట్ చేస్తున్నారు. సోమవారం నుంచి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌లోనూ అనుమానితులను చేర్చుకోనున్నారు. ఈ నాలుగు
హాస్పిటళ్లు కరోనా పోరులో కీలకంగా మారాయి. వీటిలో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించే డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, కీలకమైన అధికారులకు హోటళ్లలో బస కల్పించనున్నారు. డ్యూటీ తర్వాత ఇంటికెళ్తే ఇంట్లోని వారికీ వైరస్ సోకే ప్రమాదం ఉండే నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎన్నిగదులు అవసరం, ఎంత ఖర్చవుతుందన్నది తేల్చేందుకు ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. ఆ కమిటీ ఆదివారమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నహోటళ్లు, దవాఖానాలకు దగ్గర్లో ఉన్న కొన్ని హోటళ్లలో బస కల్పించాలని సూచించింది. ఇక డాక్టర్లు, ఇతర సిబ్బందికి ప్రస్తుతం రొటేషన్‌లో డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా పది రోజులు పనిచేస్తే.. 5 రోజులు సెలవు ఇచ్చి క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. దీనిని మార్చాలని చాలా మంది డాక్టర్లు కోరుతున్నారు. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజుల వరకు ఉన్న నేపథ్యంలో.. అందుకనుగుణంగా రొటేషన్ పీరియడ్ మార్చాలని స్పష్టం చేస్తున్నారు.
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా..
చార్మినార్ ప్రాంతంలోని ఓ హాస్పిటల్లో ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఓ లేడీ డాక్టర్‌కు కూడా కరోనా సోకింది.ఆ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ తలాబ్ కట్టకు చెందిన ఓ మహిళ చనిపోయింది. తర్వాత టెస్టులు చేయగా ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు, నర్సులకు టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో ఉన్న రెండు కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ ఇలాగే జరిగింది. పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ ఓ స్టాఫ్ నర్సు, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ వైరస్ భారినపడ్డారు. ఇక ట్రీట్‌మెంట్‌తో సంబంధం లేకుండా
సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్‌కు, ఆయన భార్య (ఆమె కూడా డాక్టర్)కూ వైరస్ సోకింది.