- దర్జాగా శాంపిల్స్ తీసుకెళ్తున్న ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది
- లైట్ తీసుకుంటున్న పెద్దాఫీసర్లు
- ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు
హనుమకొండ, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో ట్రీట్మెంట్ అందాలంటే చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలకు ఫ్రీగా టెస్టులు చేసి.. మందులు అందించాల్సిన డాక్టర్లు, సిబ్బంది ప్రైవేటు ల్యాబ్‌లతో చేతులు కలిపి పేషెంట్లను నిలువునా ముంచుతున్నారు. కేవలం టెస్టులే కాకుండా పేషెంట్లకు రాసే మందుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్లో పైసలు ఖర్చు పెట్టే స్థోమత లేని వందలాది మంది నిరుపేదలు ఎంజీఎం హాస్పిటల్‌కు తరలివస్తుంటారు. ఇలా రోజూ మూడు నుంచి నాలుగు వేల మంది ఓపీ సేవల కోసం వస్తుండగా.. రెండు నుంచి మూడు వందల మంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. కాగా ఇన్ పేషెంట్లకు టెస్టులు చేసేందుకు ఎంజీఎంలో అన్ని రకాల ల్యాబ్ ఎక్విప్మెంట్అందుబాటులో ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బంది దాదాపు 50 రకాల టెస్టులు కూడా చేస్తున్నారు. ఇంత ఎక్విప్ మెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నా.. పేషెంట్లు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనే టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొత్త పేషెంట్అడ్మిట్ అయిన వెంటనే ప్రైవేటు ల్యాబ్‌ల సిబ్బందికి సమాచారం అందుతోంది. ఆ వెంటనే వారు వార్డుల్లోకి ఎంటరై నేరుగా పేషెంట్ల దగ్గరకు వెళ్తున్నారు. ప్రతి బెడ్దగ్గరకు వెళ్లి ‘ఎంజీఎంలో టెస్టులు లేట్‌గా చేస్తరు.. మా ల్యాబ్ లో చేయించుకోండి’ అంటూ బేరం ఆడుతున్నారు. వేరే ల్యాబ్ లలో పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని, తమ ల్యాబ్ లో డిస్కౌంట్ ఇస్తున్నామంటూ మాయమాటలు చెప్పి పేషెంట్లను బుట్టలో వేసుకుంటున్నారు.
కమీషన్ల కోసం అవసరం లేని టెస్టులు
ఎంజీఎం ఆసుపత్రిలోని కొంతమంది నర్సులు, డాక్టర్లు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు ల్యాబ్‌ల సిబ్బందికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఎంజీఎంతో పాటు కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్విప్ మెంట్ లేకుంటే ఎంజీఎం డాక్టర్ల రిఫరెన్స్మేరకు ప్రైవేట్ల్యాబ్స్కు పంపించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. కొంతమంది సిబ్బంది ప్రైవేటు ల్యాబ్‌లతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని శాంపిల్స్ అన్నీ ప్రైవేటు సిబ్బంది చేతిలో పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రతీ టెస్టుకు కమీషన్ అందుతుండటంతో పేషెంట్లకు అవసరం లేని టెస్టులు కూడా రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రైవేటు ల్యాబ్‌ల బాగోతంలో ఎంజీఎం ఆసుపత్రికి చెందిన ఓ పెద్ద డాక్టర్ పాత్ర కూడా ప్రధానంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద డాక్టర్ సూచన మేరకు ఎంజీఎం ఎదురుగానే ఓ ప్రైవేటు ల్యాబ్ ఏర్పాటు చేసి దందా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రైవేటు ల్యాబ్ ల దందా ఎప్పటినుంచో సాగుతోంది. హాస్పిటల్ పెద్ద డాక్టర్ల ముందే ప్రైవేట్ల్యాబ్ల సిబ్బంది పేషెంట్ల నుంచి శాంపిల్స్ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీంతో గతంలో ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ‘ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది ఎంజీఎం లోపలికి రాకూడదు’ అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకట్రెండు రోజులు సీరియస్‌గా వ్యవహరించి ఆ తరువాత లైట్ తీసుకున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు.
మందులదీ అదే తీరు
ఓ వైపు ఎంజీఎంలో ప్రైవేట్ల్యాబ్ల దందా నడుస్తుంటే.. మరో వైపు పేషెంట్లకు రాసే మందుల విషయంలోనూ అదే జరుగుతోంది. పేషెంట్లకు ఆసుపత్రి ఫార్మసీలో దొరికే మందులు కాకుండా వేరే కంపెనీలకు సంబంధించిన మెడిసిన్ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ వివిధ మెడికల్ ఏజెన్సీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ హాస్పిటల్‌కు రావడం.. వారి మందులు మాత్రమే రాసేలా చూడాలంటూ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ఎంజీఎం డాక్టర్లు కూడా మెడిసిన్ బయటకు రాస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎంటర్ కాకూడదన్న నిబంధన ఉంది. కానీ డాక్టర్ల ఎంకరేజ్మెంట్ వల్ల మెడికల్ ఏజెన్సీల ప్రతినిధులు వార్డుల్లో యథేచ్ఛగా తిరగడమే కాకుండా.. డ్యూటీ టైమ్‌లో డాక్టర్ల క్యాబిన్లలో చర్చలు జరుపుతున్నారు. దీంతో పేషెంట్లు మెడిసిన్ కోసం ప్రైవేటు మెడికల్ షాపులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా ఎంజీఎంలో దందా సాగిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ లు, మెడికల్ ఏజెన్సీలకు చెక్ పెట్టాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, వారి బంధువులు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన నాగరాజు ఏప్రిల్ 10న వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్అయ్యాడు. అనంతరం పెద్ద డాక్టర్లను సంప్రదిస్తే అంతా బాగానే ఉందని, మందులు రాసి అబ్జర్వేషన్ లో పెట్టారు. ఎలాంటి టెస్టులూ అవసరం లేదని చెప్పారు. కానీ అక్కడున్న సిబ్బంది ఒకరు నాగరాజుకు అవసరం లేకపోయినా ఓ టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ ఇక్కడ చేయరని చెప్పి.. ప్రైవేటు ల్యాబ్ సిబ్బందికి అప్పగించారు. దీంతో ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది దర్జాగా ఆసుపత్రి లోపలికి వచ్చి శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. ఆ ప్రైవేట్ల్యాబ్రిఫరెన్స్ మీదనే శాంపిల్స్ హైదరాబాద్ పంపించి.. పేషెంట్ల నుంచి రూ.1,500 వసూలు చేశారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన చందర్ పది రోజుల కిందట అనారోగ్య కారణాలతో ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్అయ్యాడు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి సిబ్బంది రెండు టెస్టులు రాశారు. ఆ వెంటనే ఎంజీఎంలోకి ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది ఎంటరయ్యారు. ఎంజీఎంలో టెస్టులు చేస్తే రిపోర్టులు లేట్ వస్తాయని చెప్పి.. తమ ల్యాబ్ లో చేసుకొస్తామని శాంపిల్స్ తీసుకుని వెళ్లిపోయారు.
ఎంక్వైరీ చేయిస్తం
ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీ, అనవసరమైన టెస్టులు చేయిస్తున్న విషయంలో ఎంక్వైరీ చేయిస్తం. బాధ్యులపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది ఆసుపత్రి లోపలికి ఎంటర్ కాకుండా నిఘా పెడతాం. టెస్టుల విషయంలో డబ్బులు అడిగినా.. పరీక్షలు బయటకు రాసినా నేరుగా సూపరింటెండెంట్ ఆఫీస్‌లో కంప్లైంట్ చేయాలి.
- డా.వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్