- కాంగ్రెస్ టికెట్ కోసం ఆరుగురు దరఖాస్తు
- బీజేపీ నుంచి మరికొందరి ప్రయత్నాలు
- టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగేందుకు ప్లాన్
హనుమకొండ, వెలుగు : స్టెతస్కోప్ పట్టి ప్రజల నాడి చూసే డాక్టర్లు అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అని పిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ వైపు అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు దక్కించుకునేందుకు పలువురు డాక్టర్లు పోటీ పడుతున్నారు. ఒక్క కాంగ్రెస్ టికెట్ కోసమే ఆరుగురు డాక్టర్లు అప్లై చేసుకున్నారు. ఒక వేళ పార్టీ టికెట్ దక్కకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిట్టింగ్‌లపై అసంతృప్తితో పాటు తమకు జనాల్లో ఉన్న పేరును అస్త్రంగా మార్చుకొని ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాలుగు నియోజకవర్గాలకు ఆరుగురు డాక్టర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 9 స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్‌లకే కేటాయించింది. ములుగు టికెట్ బడే నాగజ్యోతి, స్టేషన్‌ఘన్‌పూర్‌ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అప్పగించగా, జనగామ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టింది. బీజేపీ టికెట్లను ఈ నెల చివర్లో గానీ, సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో గానీ ప్రకటించే చాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ టికెట్ల కోసం ఈ నెల 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు తీసుకుంది. జిల్లాలోని 12 నియోజకవర్గాలకుగానూ సుమారు 55 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ కార్యదర్శి, డాక్టర్ భూక్యా మురళీనాయక్ అప్లై చేసుకున్నారు. వైద్యసేవలపరంగా మంచి పేరు ఉండడం, డీసీసీ ప్రెసిడెంట్ భరత్‌చందర్‌రెడ్డి కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుండడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కోసం డాక్టర్ రాజమౌళి, డాక్టర్ బొల్లేపల్లి కృష్ణ పోటీ పడుతున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు 11 మంది అప్లై చేసుకోగా ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఆలిండియా ఎస్సీ డిపార్ట్‌మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్పులి అనిల్‌కుమార్, జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు.
ఇక పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ తరఫున డాక్టర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోటీకి సై అంటున్నారు. ఆమె భర్త హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. సుమారు 30 ఏండ్లుగా పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం, స్కూల్ బిల్డింగ్స్ నిర్మించడం, సొంత భూమిని డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం ఇవ్వడం, తొర్రూరులో 20 ఏండ్ల కిందటే 30 బెడ్ల హాస్పిటల్‌ను నిర్మించి సర్కారుకు అప్పగించడం వంటి పనులతో జనాల్లో పేరు తెచ్చుకున్నారు. మరోవైపు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్ సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసుకున్నారు.
బీజేపీ నుంచి కాళీప్రసాద్
పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, గార్డియన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కాళీప్రసార్ రెడీ అయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన సుదీర్ఘ కాలంగా వైద్య వృత్తిలో కొనసాగుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. హైకమాండ్ సపోర్ట్‌తో పాటు యూత్‌లో మంచి పేరుండడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు.
అలాగే ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ పిల్లి సాంబశివరావు, జనగామ ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జరిగినా క్లారిటీ ఇవ్వలేదు. టికెట్ ఆశిస్తున్న డాక్టర్లలో కొందరు ఏ పార్టీ నుంచి టికెట్రాకున్నా ఇండిపెండెంట్‌గానైనా పోటీకి సిద్ధమవుతున్నారు.