- జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు
- వారంలో రెండు రోజులు వైద్య పరీక్షలు
- త్వరలో సేవలు ప్రారంభం
సూర్యాపేట/యాదాద్రి వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మహిళలు, పురుషుల కోసం వైద్యులు సేవలందిస్తున్నారు. అదే మాదిరిగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ట్రాన్స్ జెండర్ల క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డు, ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు.
వారంలో రెండు రోజులు ఓపీ సేవలు..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్న మైత్రి క్లినిక్‌లో వారంలో రెండు రోజులు ఓపీ సేవలందించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. వైద్యులు రాసి ఇచ్చే మందులను తీసుకునేందుకు సైతం ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్య సిబ్బంది..
మైత్రి క్లినిక్‌లో సేవలందించేందుకు ప్రత్యేకంగా వైద్యులను నియమించారు. మొత్తం ఐదుగురు డాక్టర్లను నియమించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఒక గైనకాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, జనరల్ ఫిజిషీయన్, నర్సు ఉంటారు. వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలి. వారితో మాట్లాడే విధానం తదితర విషయాలపై ప్రత్యేకంగా నియమించిన వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు..
వారంలో రెండు రోజులు మాత్రమే మైత్రి క్లినిక్‌లో సేవలందించనున్నారు. ఒకవేళ క్లినిక్‌కు వచ్చే వాళ్ల సంఖ్య పెరిగితే దాన్ని బట్టి పని దినాల సంఖ్య పెంచే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 100 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇతర జిల్లాల్లో సైతం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ట్రాన్స్ జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక వైద్య సేవలందించడం సంతోషకరం..
వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లాలంటే ట్రాన్స్ జెండర్లు ఇబ్బంది పడేవారు. జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్లినా ఇబ్బందులు ఎదురయ్యేవి. కాంగ్రెస్ప్రభుత్వం ఆలోచించి తమకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది. మున్ముందు మెరుగైన వైద్య సేవలందించాలని కోరుకుంటున్నాం. – బానోతు శ్రీలేఖ, ట్రాన్స్ జెండర్ల జిల్లా అధ్యక్షులు