
- ఆర్ఎంపీలకు మద్దతివ్వడం పట్ల డాక్టర్ల సంఘాల ఫైర్
హైదరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: పీఎంపీలు, ఆర్ఎంపీలు చట్టబద్దమైన గుర్తింపును కోరు తూ మంగళవారం ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరసన సభకు ఎమ్మెల్సీ కోదండరామ్ మద్దతు తెలపడంపై డాక్టర్ల సంఘాలు మండిపడ్డాయి. బాధ్యతగల ఎమ్మెల్సీ.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలకు మద్దతు తెలపడంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశాయి.
చట్టవిరుద్దంగా వైద్యం అందిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలకు మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించాయి. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోషియేషన్, హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోషియేషన్, తెలంగాణ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్(వరంగల్) సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.
కాగా, తమ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం ఇందిరా పార్క్ వద్ద గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక నేతలు తెలిపారు. సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం హైదర్‌గూడలో ఆవిష్కరించారు.