- ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు
- నాలుగు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతుంది
- బాధితులకు గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడి
పద్మారావునగర్, వెలుగు: హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు చెప్తున్నారు. ఇది సాధారణ ఇన్ ప్లూయెంజా మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, త్వరితగతిన వ్యాప్తిచెందే ఇలాంటి వైరస్‌ల పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఫ్లూ వైరస్ వృద్ధి చెందడంతో జ్వరాలు, సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతాయని తెలిపారు. హెచ్‌ఎంపీవీ వైరస్ కొత్తది కాదని.. దీనిని 2001లోనే సైంటిస్టులు గుర్తించారని చెప్పారు.
చైనాతోపాటు పలు దేశాల్లో ఈ తరహా వైరస్ కేసులు గతంలో నమోదయ్యాయని, ఇప్పుడు వ్యాప్తి చెందడంతో భయాందోళనకు గురికావడం సహజమని గాంధీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. హెచ్‌ఎంపీవీ వైరస్ నాలుగు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతుందని, అనవసర భయాలు వద్దని, ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు వాడటంతో పాటు చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు.
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇలా..
హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) సోకిన వారిలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, తలనొప్పి, నీరసం, శ్వాసకోశ సమస్యలు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన రెండో రోజు నుంచి ఈ లక్షణాలు తీవ్రంగా బాధించి క్రమంగా తగ్గుముఖం పడతాయి. అనవసరమైన యాంటీబయాటిక్స్ మందులు వాడకుండా, వైద్యుల పర్యవేక్షణలో సింప్రమాటిక్, సపోర్టివ్ ట్రీట్‌మెంట్ అందించాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించి, ట్రీట్మెంట్ పొందాలన్నారు.
గాంధీలో ఏర్పాట్లు..
కరోనా నోడల్ సెంటరైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, పాలనాయంత్రాంగం.. హెచ్‌ఎంపీవీ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దాదాపు 2వేల బెడ్స్ కలిగిన హాస్పిటల్లో 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, దాదాపు 40 వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.