తల ఎత్తుకునేలా చేసిన్రు

న్యూఢిల్లీ: ‘డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్’ అనే కండరాల జబ్బుతో పుట్టిందా చిన్నారి. వెన్నులో లోపం కారణంగా తల కిందకు వంగిపోయి నరకాన్ని అనుభవించింది. ఇప్పుడు 13 ఏండ్ల ఆ బాలికకు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ డాక్టర్లు ఆపరేషన్​ చేసి తల ఎత్తుకునేలా చేశారు. పుట్టుకతోనే జబ్బున్నా ఆ లోపాన్ని చిన్నారి తల్లిదండ్రులు ప్రారంభంలో గుర్తించలేకపోయారు. సీరియస్ నెస్ తెలియక నిర్లక్ష్యం చేశారు. దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ చిన్నారి తల కిందకు వంగిపోయింది. పుట్టినప్పుడే డిజార్డర్ ఉన్నా.. పెరుగుతున్నకొద్దీ లక్షణాలు బయటపడ్డాయని, గత కొన్నేండ్ల నుంచే తమ బిడ్డ పరిస్థితి సీరియస్​ అయిందని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కొద్దిదూరం నడిచినా ఊపిరి తీసుకోలేకపోయేదని చెప్పారు. రానురాను మాటలు పోయాయని, వినికిడి లోపం వచ్చిందన్నారు. దీంతో ఆస్పత్రిలో చేర్పిస్తే తొలుత హాలో గ్రావిటీ ట్రీట్​మెంట్​ చేశారని, ఆ తర్వాత ఆపరేషన్​ చేసి తలను సరిచేశారని పేర్కొన్నారు. ‘‘పుట్టుకతోనే ఆ పాపకు సెరిబ్రల్ పాల్సీతో పాటు క్రేనియో సర్వికల్ డిస్​లొకేషన్, వెన్ను వంగిపోవడం వంటి జబ్బులున్నాయి. శ్వాస కూడా సరిగ్గాలేదు. పోషకాహారలోపంతోనూ బాధపడుతోంది. అందువల్ల ఆపరేషన్ కొంచెం కష్టమైంది. ఆస్పత్రిలో చేర్పించాక ముందు హాలో గ్రావిటీ ట్రీట్​మెంట్ చేశాం. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయవంతంగా ఆపరేషన్ చేశాం. ఆపరేషన్​కు 6 గంటల టైం పట్టింది’’ అని ఆస్పత్రి జాయింట్ రీప్లేస్​మెంట్, స్పైన్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్​ రాజగోపాల్ కృష్ణన్ చెప్పారు.