కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు సరికాదని.. ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీల్ధా కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా నిరసన చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో సీల్ధా జిల్లా కోర్టు సోమవారం (జనవరి 20) శిక్ష ఖరారు చేసింది. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని.. దోషి సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలన్న సీబీఐ వాదనలతో సీల్ధా జిల్లా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఏకీభవించలేదు. "ఇది చాలా అరుదైన కేసు కాదని నేను భావిస్తున్నాను. అందుకే దోషి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తున్నాను” అని జస్టిస్ అనిర్బన్ దాస్ తీర్పు వెల్లడించారు. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది న్యాయస్థానం.
ALSO READ | కోల్కత్తా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు
అలాగే.. బాధిత ఫ్యామిలీకి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ అనిర్బన్ దాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సీల్ధా కోర్టు తీర్పుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన దోషికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో సీల్ధా కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.