‘వసూల్’ కాదు.. ఖర్చులకు ఇచ్చాం
ఆర్డీఓ ఎంక్వైరీలో మాట మార్చిన పేషెంట్లు
బయటపడేందుకు డిచ్‌పల్లి సీహెచ్‌సీ స్టాఫ్ ప్రయత్నాలు
గట్టెక్కించాలని హైదరాబాద్‌కు వెళ్లి పైరవీ
నిజామాబాద్, వెలుగు: డిచ్‌పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ‘పైసా వసూల్’ వ్యవహారంపై ఫీల్డ్ లెవల్ లో ఎంక్వైరీ కొనసాగుతోంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాఫ్ తప్పించుకునేందుకు జోరుగా పైరవీలు చేసినట్లు ప్రచారమవుతోంది. డిచ్ పల్లి సీహెచ్ సీలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు, కాన్పుల కోసం పేషెంట్ల నుంచి సిబ్బంది పైసలు వసూలు చేసినట్లు ఇటీవల ఫిర్యాదులు వచ్చాయి. పైఆఫీసర్ల ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్డీఓ రవి, తహసీల్దార్ వేణు కలిసి శనివారం మండలంలోని నాలుగు తండాల్లో దాదాపు 12 మంది పేషెంట్లను ఎంక్వైరీ చేశారు. స్టాఫ్‌లో టెన్షన్ నెలకొనగా, అక్రమాలు బయటపడకుండా ఇప్పటికే తమకు అనుకూలంగా పైరవీలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెడ్ నర్స్ టీమ్ చెప్పినట్లుగానే..
డిచ్ పల్లి మండలం మిట్టపల్లితండా, ఘణపూర్, వెస్లీనగర్ తండా, నాకాతండాల్లో ఆర్డీఓ రవి శనివారం విచారణ జరిపారు. ‘సీహెచ్ సీ సిబ్బందికి పైసలు ఇచ్చాం.. కానీ బలవంతంగా వసూల్ చేయలేదు’ అని బాధితులు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. మమ్మల్ని ఎవరూ పైసలు అడగలేదని, ఎవరికీ ఇవ్వలేదని ముగ్గురు చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తే ఇంతకన్నా ఎక్కువ ఖర్చవుతాయి కదా! ఇక్కడ మందుల ఖర్చు, ఇతర ఖర్చుల కోసం మాత్రమే తీసుకున్నారని పేషెంట్లు అన్నట్లు తెలిసింది. అయితే ఎంక్వైరీలో ఎలా చెప్పాలో హెడ్ నర్స్ టీమ్ ముందస్తుగా ప్రిపేర్ చేయడంతోనే వారు ఇలా స్టేట్ మెంట్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది.
కొద్ది రోజుల్లోనే మారిన తీరు
డిచ్ పల్లి సీహెచ్ సీలో ‘పైసా వసూల్’ వ్యవహారంలో స్టాఫ్‌పై చర్యలు తీసుకోవాలని పేషెంట్లు డిమాండ్ చేశారు. తీరా ఎంక్వైరీలో ఏదో ఖర్చులకు ఇచ్చామని చెప్పడం చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక స్టాఫ్ పైరవీలే కారణమని వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. పేషెంట్లను సీహెచ్ సీకి రెఫర్ చేసిన ఏఎన్ ఎంలు కూడా స్టాఫ్‌పై ఫిర్యాదు చేశారు. వారి అక్రమ వసూళ్లపై సీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాబురావు ఈనెల 12న లిఖిత పూర్వకంగా పైఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్టాఫ్ నాడు భయాందోళనకు గురైంది.
పేషెంట్లకు తిరిగి పైసల చెల్లింపు
పేషెంట్లకు పైసలు తిరిగి చెల్లించేందుకు స్టాఫ్ మొదట చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ లోని ఆఫీసర్ల సలహా ప్రకారం మరోసారి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పేషెంట్లు ఉన్న ఊళ్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా వెళ్లి పైసలు తిరిగి చెల్లించి సర్ది చెప్పారు. తమకు వ్యతిరేకంగా చెప్పే అవకాశం ఉన్నోళ్లకు డబుల్ పైసలు ముట్టిజెప్పినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులుగా కొనసాగింది. ఆర్డీఓ విచారణకు రాగా స్టాఫ్ మేనేజ్ చేసినట్లుగా స్టేట్ మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
డీహెచ్ ఆఫీస్ లో సంప్రదింపులు
తమకు వచ్చిన ముప్పును తప్పించుకోవడావనికి స్టాఫ్ ఇటీవల హైదరాబాద్ కు వెళ్లింది. జిల్లాస్థాయిలో ఎమోషనల్ గా మేనేజ్ చేసి, నాలుగు రోజుల కింద డీఎంహెచ్ఎం ఆఫీసులోని ఓ సీనియర్ ఆఫీసర్ తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులోని ఆఫీసర్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం చాలా సీరియస్ గా ఉండడం, మెడికల్ ఆఫీసరే ఫిర్యాదు చేయడంతో వీరికి హెల్ప్ చేస్తే తాము ఇరుక్కుంటామని ఎవరూ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని సమాచారం. చివరికి కాళ్లావేళ్లా పడడంతో ఫీల్డ్ లెవల్ లో పేషెంట్ల నుంచి అనుకూలంగా స్టేట్ మెంట్ ఇప్పించుకుంటే గట్టెక్కవచ్చని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో స్టాఫ్ ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
For More News..