ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

  • ప్రతి 100 మంది గర్భిణుల్లో 73 మందికి సిజేరియన్లు
  • ఐదేళ్లలో 53,71 మంది డెలివరీ అయితే 38,767 మందికి సిజేరియన్ డెలవరీలే
  • యాదాద్రి జిల్లాలో రోజుకు 22 ఆపరేషన్లు
  • పైసల కోసం ప్రైవేట్ హాస్పిటళ్ల అడ్డగోలు దందా
  • వెయిటింగ్ఎందుకంటున్న డాక్టర్లు

యాదాద్రి, వెలుగు: నెలలు నిండిన గర్భిణి హాస్పిటల్ కు వస్తే చాలు ప్రైవేటు హాస్పిటళ్ల నిర్వాహకులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యం అయింది.. ఇంకా లేట్ అయితే తల్లీ బిడ్డకు ప్రమాదం అంటూ గర్బిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు. వాళ్లు సరే అనడమే ఆలస్యం కడుపు నిలువునా కోసేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయడం ఎందుకంటూ ఆపరేషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. యాదాద్రి జిల్లాలో రోజుకు 22 సిజేరియన్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

100లో 73 మందికి సిజేరియన్‌‌‌‌...

చాలా మంది గర్భిణులు మొదటి నెల నుంచి 9వ నెల వరకు ప్రభుత్వ హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, సరైన వసతులు లేకపోవడంతో డెలివరీ టైంకు ప్రైవేటు హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. యాదాద్రి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో 2018 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 53, 170 మందికి డెలివరీలు జరిగాయి. ఇందులో 14,403 మంది నార్మల్ డెలివరీ కాగా, 38,767 మందికి సిజేరియన్ చేశారు. అంటే జిల్లాలో రోజుకు సగటున 22 మందికి ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రతి 100 మందిలో 27 మంది నార్మల్ డెలివరీ అవుతుంటే, 73 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. 

ప్రైవేటు హాస్పిటల్స్ లోనే ఎక్కువ

ప్రైవేట్ హాస్పిటల్ కు గర్భిణి వస్తే చాలు రకరకాల పేరుతో టెస్టులు చేస్తున్నారు. డెలివరీ టైం దగ్గర పడగానే ‘నార్మల్ కోసం ప్రయత్నం చేయమంటే చేైస్తాం.. కానీ లేటయితే తల్లీ పిల్లలకు ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు’ అంటూ గర్భిణితోపాటు ఆమె బంధువులను భయపెడుతున్నారు. దీంతో వారు సిజేరియన్ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో ఆపరేషన్ కు హాస్పిటల్ స్థాయిని బట్టి రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ఐదేండ్లలో యాదాద్రి జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో 22,799 మంది డెలివరీ అయ్యారు. ఇందులో 2, 748 మంది నార్మల్ డెలివరీలు కాగా.. 20,051 మందికి సిజేరియన్లు అయ్యాయి. ఈ లెక్కన ప్రైవేటు హాస్పిటల్స్ లో ప్రతి 100 మందిలో 88 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. 

సర్కార్లోనూ పెరుగుతున్న సిజేరియన్లు

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్ లోనూ సిజేరియన్ల సంఖ్య పెరిగింది. ఇక్కడ ప్రతి 100 మందిలో 61 మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయాలంటే ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. సర్కార్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లు స్థానికంగా ఉండడం లేదు. దీంతో వెయిట్ చేయడం ఎందుకంటూ ఆపరేషన్లు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో 30,371 మంది డెలివరీ కాగా.. 11,655 మంది నార్మల్ డెలివరీ అయ్యారు. మొత్తం 18,716 మందికి సిజేరియన్లు జరిగాయి. నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని ప్రచారం చేస్తున్న హెల్త్ ఆఫీసర్లు, ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్ లో వచ్చే ఆరోగ్య సమస్యలపై గర్భిణులకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. దీంతో కొందరు గర్భిణులు పురుటి నొప్పులు తట్టుకోలేక సిజేరియన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరైతే ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. 

ఆపరేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు
గర్భిణులు పెయిన్స్ ను భరించడం లేదు. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయమని చెప్పినా ఒప్పుకోవడం లేదు సిజేరియన్ చేయమంటూ గర్భిణితోపాటు ఆమె బంధువులు కోరుతున్నారు. - ఓ ప్రైవేటు డాక్టర్ 

‘బీజేపీ, టీఆర్ఎస్ ప్రజలను ఆగం చేశాయి’

యాదగిరిగుట్ట, వెలుగు: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో కరోనా కంటే ప్రమాదకరమైనవని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్లలో ప్రజల జీవితాలను ఆగం చేశాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు మద్దతుగా ఆదివారం యాదాద్ర ిజిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని మహబూబ్ పేట వద్ద ప్రారంభమైన యాత్ర మర్రిగూడెం, చొల్లేరు, వంగపల్లి, రామాజిపేట మీదుగా చిన్న కందుకూరు వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం మోపారన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. యాదగిరి గుట్ట, ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ. యాకూబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

మట్టి తరలింపు నిలిపివేయాలి

కోదాడ, వెలుగు: మట్టి టిప్పర్ల రాకపోకల కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి కాలనీ – కాపుగల్లు గ్రామాల మధ్య రోడ్లు దెబ్బతింటున్నాయని, మట్టి తరలింపును ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రోడ్డుపై ముళ్ల కంచె వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోదాడ – ఖమ్మం హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నెల రోజుల నుంచి నిరంతరాయంగా మట్టి తరలిస్తున్నారన్నారు. టిప్పర్ల రాకపోకల కారణంగా రోడ్లు, వాటి వెంట ఉన్న పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేట, వెలుగు: పెండింగులో ఉన్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని టీయూటీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చిరాం డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మీటింగులో ఆయన మాట్లాడారు. హైస్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ లో టీచర్ల కొరత ఉందన్నారు. డీఈఓ, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అంతకు ముందు టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లను చేపట్టాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మురళీ మనోహన్ రెడ్డి, ఆర్ధిక కార్యదర్శి పి.మొగులయ్యా, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.గోపాల్, రాష్ట్ర సహాధ్యక్షుడు దామెర శ్రీనివాస్, బాబు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి

మునుగోడు, వెలుగు: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన పలువురు పద్మశాలీ సంఘం నాయకులు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కూసుకుంట్ల పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. పార్టీలో చేరిన వారిలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు వర్కాల మధుకర్, గౌరవ అధ్యక్షుడు గంజి భిక్షమయ్య, సహకార సంఘం అధ్యక్షుడు సంగిశెట్టి పరమేశం, మార్కండేయ ఆలయ అధ్యక్షుడు కొంగరి వెంకటేశ్ ఉన్నారు. ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, మండల అధ్యక్షుడు పురుషోత్తం పాల్గొన్నారు. 

ప్రతి కార్యకర్త కాంగ్రెస్ క్యాండిడేటే.. 

నల్గొండ, వెలుగు: మునుగోడు ఎన్నికల్లో ప్రతి కార్యకర్త క్యాండిడేటే అని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. చండూరు మండలం ఇడికుడలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగింది తప్ప, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచాక చేసిందేమీ లేదన్నారు. ప్రజలు నమ్మకంతో గెలిపించిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మోసం చేసి బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు.

‘డబుల్’ ఇండ్ల కోసం 23న కలెక్టరేట్ ఎదుట ధర్నా

సూర్యాపేట, వెలుగు: డబుల్ ఇండ్లు, స్థలాల కోసం ఈనెల 23వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కుమ్మరి బజార్ లో నిర్వహించే సర్వేలో ఆమె మాట్లాడారు. అనేక మంది పేదలు కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పూర్తయిన డబుల్ ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో శిధిలావస్థకు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సర్వేలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న పాల్గొన్నారు. 

గిరిజన రిజర్వేషన్ల పెంపు హర్షణీయం

దేవరకొండ/మిర్యాలగూడ/హాలియా/హుజూర్ నగర్, వెలుగు: గిరిజన రిజర్వేషన్ల పెంపు, గిరిజన బంధు పథకం ప్రకటించడం హర్షణీయమని దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నగేశ్ రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ ఆదివారం దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ లో ఆయన ఫోటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పాలన సాగిస్తోందన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే ఆదివాసీ, గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
నల్గొండ, వెలుగు:
 రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో ఆదివారం హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రధాని మోడీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులయ్యే చాలామంది బీజేపీలో చేరుతున్నారన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు బీజేపీలో చేరారు.వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.