- ముంబైలో 6 నెలల పాపకు హెచ్ఎంపీవీ
- దేశంలో ఎనిమిదికి చేరిన వైరస్ కేసులు
న్యూఢిల్లీ: ముంబైలో ఆరు నెలల పసికందుకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తీవ్రమైన దగ్గు, ఆక్సిజన్ లెవెల్స్ 84శాతానికి పడిపోవడంతో ఈ నెల 1న ఆ శిశువును కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు.
ఐదారు రోజులపాటు ఐసోలేషన్‌లో డాక్టర్ల పర్యవేక్షణ తర్వాత ఆమెను గురువారం డిశ్చార్జి చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 7 కేసులు నమోదుకాగా, ఇది ఎనిమిదో కేసు. మొత్తంగా మహారాష్ట్రలో 3, గుజరాత్లో ఒకటి, కర్నాటకలో 2, తమిళనాడులో 2 కేసులు నమోదయ్యాయి.
అయితే, ఈ వైరస్ తో పెద్దగా ప్రమాదమేమీ లేదని, టెన్షన్ పడొద్దని దేశవ్యాప్తంగా రాష్ట్రాలు ప్రజలకు సూచనలు చేశాయి. ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్‌తో సహా అనేక రాష్ట్రాలు ప్రజలను భయాందోళన చెందవద్దని కోరాయి.
మిజోరాంలో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ సిటీల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
కాగా, హెచ్ఎంపీవీ వైరస్‌కు కరోనా వైరస్ కు ఎటువంటి పోలిక లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్ వెల్లడించారు. అయితే, ఎలాంటి వైరస్ సోకినా మాస్క్ ధరించడం, ఐసోలేషన్‌లో ఉండటం వంటి జాగ్రత్తలతో తొందరగా క్యూర్ అవుతారని తెలిపారు.