నల్గొండ ఆస్పత్రిలో నెఫ్రాలజిస్ట్‌‌ లేక రోగుల అవస్థలు

నల్గొండ, వెలుగు : జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో నడుస్తున్న డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో కిడ్నీ స్పెషలిస్ట్‌‌‌‌లు (నెఫ్రాలజిస్ట్) లు లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల బాగోగులను చూసే డ్యూటీ డాక్టర్లు కూడా సరిగా పట్టించుకోకపోవడంతో పేషెంట్లు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం డయాలసిస్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. సూర్యాపేటలో 57 మంది పేషెంట్లు ఉండగా ఐదు బెడ్లు ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌ పద్ధతిన పనిచేస్తున్నారు. కానీ 107 మంది ఉన్న నల్గొండ డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో 10 బెడ్లు ఉండగా ఒక్క డాక్టర్‌‌‌‌ కూడా లేడు. నల్గొండలో జిల్లాలో కిడ్నీ రోగులు ఇబ్బందులు పడుతుండడంతో రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌‌‌‌ గౌరవ్‌‌‌‌ ఉప్పల్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌లో పనిచేస్తున్న ఓ నెఫ్రాలజిస్ట్‌‌ను కాంట్రాక్ట్‌‌‌‌పై నియమించారు. కానీ డ్యూటీల 
విషయంలో డాక్టర్లు, ఆఫీసర్ల మధ్య గొడవలు జరిగాయి. నెఫ్రాజలిస్ట్‌‌ డయాలసిస్‌‌‌‌ వార్డుకు కాకుండా పిజీషియన్‌‌‌‌ వార్డులకే పరిమితం కావాలని, లేదంటే ఉద్యోగం వదిలి పోవాలని హుకుం జారీ చేశారు. డాకర్లు, అధికారుల మధ్య గొడవలు ముదిరిపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌‌‌‌గా తీసుకున్న పైఆఫీసర్లు హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ను మార్చడంతో పాటు, కొంతమంది  కొత్త డాక్టర్లను కాంట్రాక్ట్‌‌‌‌ మీద మళ్లీ తీసుకున్నారు. కానీ డయాలసిస్ విభాగంలో మాత్రం ఎవరినీ నియమించలేదు. పక్కనే ఉన్న మిర్యాలగూడ డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఐదు బెడ్స్‌‌‌‌ ఉండగా, 40 మంది పేషెంట్లు ఉన్నారు. అక్కడ మాత్రం ఫిజిషియన్‌‌‌‌ వారానికోసారి రోగులను చెకప్‌‌‌‌ చేస్తున్నారు. కానీ నల్గొండ డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ గురించి మాత్రం ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.

107 మంది రోగులు.. 10 బెడ్లు 
జిల్లాతో పాటు మద్దిమడుగు లాంటి దూర ప్రాంతాల నుంచి కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం నల్గొండకు వస్తుంటారు. ఒకప్పుడు 60 మంది ఉన్న రోగులు ఇప్పుడు 107కు పెరిగారు.  బెడ్స్ చాలకపోవడంతో నాలుగైదు షిప్ట్‌‌‌‌లలో డయాలసిస్‌‌‌‌ చేస్తున్నారు. రోగులకు సెంటర్‌‌‌‌ కిక్కిరిసిపోతున్నా మానిటరింగ్‌‌‌‌ చేయాల్సిన డాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. నల్గొండలో సొంతంగా ప్రైవేట్‌‌‌‌ డయాలసిస్‌‌‌‌ సెంటర్లు ఉన్న కొందరు డాక్టర్లు నల్గొండ హాస్పిటల్‌‌‌‌లో కాంట్రాక్ట్‌‌‌‌పైన పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు వచ్చే రోగులను ప్రైవేట్‌‌‌‌కు రెఫర్‌‌‌‌ చేస్తున్నారని పలువురు 
ఆరోపిస్తున్నారు.

గతేడాది నవంబర్​లో వచ్చిన కిడ్నీ డాక్టర్​..
జిల్లాలోని డయాలసిస్‌‌‌‌ సెంటర్లన్నీ ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ హబ్‌‌‌‌ కింద పనిచేస్తున్నాయి. కిడ్నీలకు సెపరేట్‌‌‌‌గా డాక్టర్‌‌‌‌ లేకపోవడంతో ప్రతి ఆరు నెలలకోసారి ఉస్మానియా నుంచి స్పెషలిస్ట్‌‌‌‌ వచ్చి డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను విజిట్‌‌‌‌ చేసి రోగుల హెల్త్‌‌‌‌ కండిషన్‌‌‌‌ తెలుసుకుంటున్నారు. గతేడాది నవంబర్‌‌‌‌లో వచ్చిన స్పెషలిస్ట్‌‌‌‌ ఇప్పటివరకు మళ్లీ రాలేదు. ఈ విషయంపై హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ లచ్చు మాట్లాడుతూ డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు ప్రత్యేకంగా కిడ్నీ డాక్టర్లు లేరని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫిజిషియన్లను పంపిస్తున్నామని చెప్పారు.

డయాలసిస్‌‌‌‌ సెంటర్‌‌‌‌ పక్కనే కొవిడ్‌‌‌‌ వార్డు
హాస్పిటల్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ సరిపోకపోవడంతో డయాలసిస్‌‌‌‌ వార్డు పక్కనే కరోనా వార్డు ఏర్పాటు చేశారు. దీంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా, డయాలసిస్ రోగులు పక్కపక్క వార్డుల్లోనే ఉండడంతో వాళ్ల తరఫున వచ్చే కుటుంబ సభ్యులంతా ఒకేచోట ఉంటున్నారు. దీంతో ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌‌‌‌ వార్డులోకి వచ్చేపోయేందుకు మరో ఎంట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆఫీసర్లు దాని గురించి పట్టించుకోవడం లేదు.