ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన

  • ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళన
  • వార్డుల్లో ఎలుక కరిచినా.. దోమ కుట్టినా డాక్టర్లదే బాధ్యత అంటే ఎలా..?
  • ఓపీలో పేషెంట్లను చూస్తున్నప్పుడు ఎలుక కొరికితే.. పేషెంట్లను చూడాలా..? ఎలుకలు పట్టాలా..?
  • ఎలుక పేషెంట్ ను కొరికితే.. సూపరింటెడెంట్ దేనా బాధ్యతా..? ప్రభుత్వ బాధ్యత ఏమీ లేదా..?

వరంగల్ జిల్లా: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో  పేషెంట్ పై ఎలుకల దాడి చేసిన ఘటనకు బాధ్యులుగా ఇద్దరు డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.  ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎలుకల బోన్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేం ప్రభుత్వ వైద్యులం.. రోగులకు వైద్య చికిత్స చేయడానికి మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నామని, తమ విధులు రోగులను చూడడం.. రోగాన్ని నిర్ధారించి చికిత్స చేయడం వరకేనన్నారు. తమ విధులు నిర్వహించడంలో ఏమైనా నిర్లక్ష్యం ఉంటే.. లేదా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం జరిగినా ప్రశ్నించొచ్చు అన్నారు. వార్డులో ఎలుకలు వస్తున్నాయని చెప్పగానే  ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా పరిశీలించి.. చెత్త, సామాన్లు తీసేయించారని.. తర్వాత కూడా కాంట్రాక్టర్ కు కేవలం నెల రోజుల్లోనే రెండుసార్లు నోటీసులివ్వడం జరిగిందన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎలుక వచ్చి పేషెంట్ ను కొరికితే.. అది కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ లేదా.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందజేయాలి గాని.. ఏదో ఉద్దేశాలతో అడిషనల్ డీఎంఈ క్యాడర్ లో ఉన్న సూపరిండెంట్ ని షోకాజ్ లేకుండా.. మెమో ఇవ్వకుండా.. కనీసం వివరణ అడగకుండా డీఎంఈకి సరెండర్ చేయడం చాలా అన్యాయం అన్నారు.

డ్యూటీ డాక్టర్లు పేషెంట్లను చూడాలా.. ఎలుక కొరికిందంటే ఎలుకలు పట్టుకుంటూ ఉండాలా..?

అడిషనల్ డీఎంఈ స్థాయిలో ఉన్న డాక్టర్ కే ఇలా జరిగితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో ఉన్న వారు వార్డుల్లో తిరుగుతూ రోగులకు ఏ విధంగా సేవ చేయగలగుతారని ప్రశ్నించారు. వార్డుల్లో ఉన్న పేషెంట్లకు ఎలుక కొరికినా.. దోమ కుట్టినా డాక్టర్లను బాధ్యులుగా చేస్తామంటే.. డ్యూటీ డాక్టర్లకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీలో పేషెంట్లను చూస్తున్న సమయంలో ఏదైనా ఎలుక వచ్చి రోగిని కుట్టిందంటే.. డ్యూటీ డాక్టర్లు పేషెంట్లను చూడాలా..? ఎలుకలు పట్టాలా..? అని ప్రశ్నించారు. 

సూపరింటెండెంట్ ను వెంటనే సస్పెండ్ చేసి.. ఎలుకలు పట్టే ఏజెన్సీని మాత్రం రెండు రోజుల తర్వాత చేస్తారా..? మిగతా స్టాఫ్ ఎవరి మీద ఎలాంటి యాక్షన్ లేదు.. డీఎంఈ క్యాడర్ లో ఉన్న సూపరింటెండ్ పైనే ఆ స్థాయి చర్యలు తీసుకుంటే.. వార్డుల్లో ప్రత్యక్షంగా రోగులకు చికిత్స చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి ఏమిటి ? .. ప్రభుత్వ ఇమేజీ పెంచడానికి మేమంగా తోడ్పడుతుంటే.. మామీద వెనుక నుంచి దెబ్బ వేయడం సరికాదన్నారు. శానిటేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కానీ, డాక్టర్లను సస్పెండ్ చేయటం అన్యాయన్నారు.ఇద్దరు డాక్టర్లపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అందోళన కొనసాగిస్తామన్నారు.

సస్పెన్షన్ రీవోక్ చేసే వరకు ఆందోళన
శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ విధించడం చాలా అన్యాయమని.. వెంటనే ఈ సస్పెన్షన్ ను రీవోక్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తర్వులు జారీ చేయకపోతే.. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి మరింత ముమ్మరం చేస్తామని ప్రకటించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..