- ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినవారికి సీటిచ్చారు : ఇన్ సర్వీస్ డాక్టర్లు
- సీఐడీ విచారణకు డిమాండ్
హనుమకొండ, వెలుగు : పీజీ మెడికల్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇన్ సర్వీస్ కోటాలో అక్రమాలు జరిగాయని, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన కొంత మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారని ఇన్ సర్వీస్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలోని రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య సంఘాల జేఏసీ నాయకుడు కత్తి జనార్దన్ మాట్లాడారు. పీజీ మెడికల్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇన్ సర్వీస్ కోటాలో అనర్హులకు సీట్లు కేటాయించారని ఆరోపించారు. కన్వర్షన్ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ చేయకుండానే వర్సిటీలో దాదాపు 90 నుంచి 100 సీట్లు నాన్ సర్వీస్ వాళ్లకు కట్టబెట్టారన్నారు.
నీట్ గైడ్ లైన్స్, తెలంగాణ జీవో 155 నిబంధనలు పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, దీంతో ఆఫీసర్లు ఆయా సీట్లను నాన్ సర్వీస్ కోటా కింద మళ్లీ అలాట్ చేశారని ఆరోపించారు. ఒక లేడీ అభ్యర్థి ఫేక్ సర్టిఫికెట్ పెట్టినా ఉస్మానియాలో సీటు ఇచ్చారని, ఈ విషయాన్ని గుర్తించి కంప్లైంట్ చేసినా నాన్ సర్వీస్ కోటా కింద నల్గొండ జీజీహెచ్లో సీటు ఇచ్చారన్నారు. అసలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయకుండా సీట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు.
గ్రూప్ వన్ మాదిరిగానే పీజీ మెడికల్ సీట్లలో కూడా ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడి అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ రద్దు చేసి, ఫిజికల్ గా రీ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వీసీ, సంబంధిత స్టాఫ్, అక్రమంగా సీట్లు పొందిన వారిపై సీఐడీ విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవాలని కోరారు.