అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట ఏరియా హాస్పిటల్ వైద్యులు, ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన డాక్టర్లు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రాత్లావత్ దశరథం(45) శనివారం పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా, బంధువులు హాస్పిటల్ కు తీసుకువచ్చారు. పురుగులమందు కక్కించేందుకు డాక్టర్, సిబ్బంది ప్రయత్నిస్తుండగా రోగి బంధువులు వారిని తిడుతూ దాడికి యత్నించారు. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ కు రిఫర్ చేశారు.
దీంతో మరింత ఆగ్రహానికి గురైన రోగి బంధువులు హాస్పిటల్ లోని ల్యాబ్, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దాడిని ఖండిస్తూ వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని తిట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ అనుదీప్ తెలిపారు. నిరసనలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డాక్టర్ శంకర్, ఫార్మసిస్ట్ రాజేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.