బ్యాటరీలు, బ్లేడ్లు ఎలా మింగావ్‌రా..! 15 ఏళ్ల బాలుడి కడుపులో 56 వస్తువులు

బ్యాటరీలు, బ్లేడ్లు ఎలా మింగావ్‌రా..! 15 ఏళ్ల బాలుడి కడుపులో 56 వస్తువులు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు గంటలపాటు శ్రమించి అతని కడుపులోని 56 వస్తువులను తొలగించాక గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు. కళ్లముందే కొడుకు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడని చెప్తూ మృతుని తండ్రి కంటతడి పెట్టుకున్నారు.

కడుపులో 56 వస్తువులు

హత్రాస్‌కు చెందిన సంచిత్ శర్మ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడి పేరు.. ఆదిత్య. 15 ఏళ్ల వయస్సున్న ఈ బాలుడు స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు ఆదిత్యకి కడుపునొప్పి రావడంతో అతని తండ్రి హత్రాస్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు అతన్ని జైపూర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాసేపు కోలుకున్నట్లు కనిపించిన బాలుడు.. నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి ఆవరణలోనే తీవ్రమైన కడుపునొప్పితో విలవిలాడిపోయాడు. 

హుటాహుటీన కుటుంబసభ్యులు అతన్ని అలీగఢ్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు.. అల్ట్రాసౌండ్ టెస్టులు చేశారు. ఆ రిపోర్టులు చూశాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అతని శరీరంలో దాదాపు 19 వస్తువులు ఉన్నట్లు తేలింది. దాంతో వారు అతన్ని నోయిడాలోని అధునాతన సదుపాయాలున్న మరో  ఆస్పత్రికి రెఫర్ చేశారు. నోయిడా ఆస్పత్రికి వెళ్లాక అతనికి మరొక స్కాన్‌ నిర్వహించగా.. 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. 

వెంటనే బాలుడిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గత నెల(అక్టోబర్) 27న శస్త్రచికిత్స చేశారు. 8 మంది సభ్యులు గల వైద్య బృందం ఎన్నో గంటల పాటు శ్రమించి అతని కడుపులోకి 57 వస్తువులను తొలగించారు. వీటిలో బ్యాటరీలు, బ్లేడ్‌లు, గోర్లు సహా కొన్ని విదేశీ వస్తువులు ఉన్నాయి. ఎలాగోలా శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడు ఆ సమయంలో ప్రాణాలతో బయటపట్టాడు. 

ఈ సర్జరీ జరిగిన మరుసటి రోజే బాలుడు ప్రాణాలు వదిలాడు. శస్త్రచికిత్స అనంతరం బాలుడి గుండె వేగం అమాంతం పెరిగిపోవడంతోపాటు బీపీ కనిష్టస్థాయికి పడిపోయినట్లు బాలుడి తండ్రి తెలిపారు. కొడుకు కళ్లముందే ప్రాణాలు వదిలాడని చెప్తూ మృతుని తండ్రి కంటతడి పెట్టుకున్నారు. తన కొడుకును బ్రతికించేందుకు డాక్టర్లు ఎంతో శ్రమించారని.. కానీ, తన బిడ్డ విధి రాత బాగోలేదని వాపోయారు.