మనం తినే అన్నంలో పిండి పదార్థాలు తప్ప శరీరానికి అవసరమైన పోషకాలు ఉండటం లేదు. ఆ సమస్యను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైసును ప్రోత్సహిస్తోంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? అవి ఎలా తయారు అవుతాయి? వాటికి అవసరమైన కెర్నల్స్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? వాటి వల్ల ఉపయోగాలేంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?
బాయిల్డ్ రైస్, రా రైసు అంటే అందరికీ తెలుసు. కానీ, ఫోర్టిఫైడ్ రైస్ అంటే చాలామందికి తెలియదు. మనం తినే బియ్యంలోనే కెర్నల్స్ కలిపితే.. వాటిని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. పోషక దాతువులైన కెర్నల్స్ అచ్చం బియ్యం లాగే ఉంటాయి. వీటిని తయారు చేసే ప్రక్రియ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. దేశంలో చాలా మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని .. ఈమధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్టును విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. పిల్లలు బరువు పెరగకపోవడం, వయస్సుకు తగ్గ ఎదుగుదల లేకపోవడానికి కారణం .. వాళ్లు తినే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడమేనని సర్వేలో గుర్తించారు. గర్బిణీల్లో 50 శాతం కంటే ఎక్కువమంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రోజువారి ఆహారంలో పోషకాలు చేర్చేలా.. కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఫోర్టిఫైడ్ రైస్’ తయారీ, పంపిణీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తున్న కరీంనగర్ వాసి...
ఉత్తరాదిన గోధుమలు, దక్షిణాదిలో బియ్యం ప్రజల ప్రధాన ఆహార అలవాటు. అయితే, ధాన్యం మరపట్టే సమయంలో ఎక్కువగా పాలిష్ చేయడంవల్ల అందులోని పోషకాలు పోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీచేసేలా ఫోర్టిఫైడ్ రైస్ తినాలని కేంద్రం సూచిస్తోంది. ఇవి మిల్లుల్లో తయారు చేసి బియ్యంలో కలిపి తినడం వల్ల ప్రతి ఒక్కరికీ కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు అందుతాయి. ఆ ప్రకియను కరీంనగర్ రేణికుంటలోని ఓ ఇండస్ట్రీ చేపట్టింది.
కరీంనగర్ కు చెందిన శశికిరణ్.. ఫోర్టిఫైడ్ రైస్ కు కావాల్సిన కెర్నల్ తయారీ యంత్రాలను మూడుకోట్లు పెట్టి తన రైసు మిల్లు ఆవరణంలో ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఈ కెర్నల్స్ తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం బియ్యం నుంచి నూకలతో పాటు.. ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి తెప్పించిన పోషక ధాతు పౌడర్ ను ఉపయోగించి కెర్నల్స్ ను ఇక్కడి యంత్రాల్లో తయారు చేస్తున్నారు. నూకల పిండిలో పోషకాలతో కూడిన పౌడర్ ను నిర్ధేశిత నిష్పత్తిలో మిక్స్ చేసి, కెర్నల్స్ తయారు చేస్తారు. కెర్నల్ తయారీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. 3 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ యంత్రాలతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 20 మంది వర్కర్లు నిరంతరం పనిచేస్తుంటారు.
పిండి, పోషకాల పౌడర్ కలిపిన తర్వాత.. కెర్నల్ తయారీ ప్రాసెస్ మొదలవుతుంది. కరీంనగర్ లోని ఈ మిల్లులో తయారైన కెర్నల్స్ ను రైసు మిల్లర్లకు అందిస్తున్నారు. ఆయా మిల్లులు మిల్లింగ్ కోసం ఇచ్చిన బియ్యంలో కెర్నల్స్ మిక్స్ చేసి ఫోర్టిఫికేన్ చేస్తారు. ఆ రైస్ ను తిరిగి ప్రభుత్వానికి ఇస్తారు. ఈ బియ్యమే రాష్ట్రంలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు అందజేస్తున్నారు.