
- కండల కోసం తప్పు దారి పట్టిస్తున్న జిమ్ ట్రైనర్లు, ఓనర్లు
- సైడ్ ఎఫెక్ట్స్ఉన్నా లైట్..
హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీలోని కొన్ని జిమ్సెంటర్లలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడకం పెరుగుతోంది. ‘త్వరగా కండలు పెంచాలి. ఇంప్రెస్ చేయాలి’ అంటూ కొంతమంది యూత్ స్టెరాయిడ్స్వాడుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది జిమ్ ట్రైనర్లు, నిర్వాహకులు కూడా యూత్‌ను తప్పుదోవ పట్టిస్తూ స్టెరాయిడ్స్‌కు అలవాటు పడేలా చేస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నెలల్లోనే బాడీ షేప్మార్చేలా చేస్తామని, సిక్స్ ప్యాక్ తెప్పిస్తామని ప్రచారం చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
దొరుకుతూనే ఉన్నా ఆపడం లేదు
గతేడాది డిసెంబర్లో మెహిదీపట్నంలో ఓ జిమ్ ట్రైనర్ వద్ద 217 స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు పట్టుకున్నారు. మూడు నెలల కింద కోఠి, మియాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రూ.3 లక్షల విలువ చేసే స్టెరాయిడ్స్‌ను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లు పట్టుకున్నారు. గత సోమవారం హుమాయున్‌నగర్‌లో రూ.1.80 లక్షల విలువ చేసే 23 రకాల స్టెరాయిడ్స్ సీజ్ చేసి- ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇలా సిటీలో ఎప్పుడూ ఏదో చోట స్టెరాయిడ్స్ అమ్మేవాళ్లు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా, స్టెరాయిడ్స్ వాడకం తగ్గడం లేదు. కొన్ని జిమ్ లలో, వాటికి దగ్గర్లో ఉండే మెడికల్ షాపుల్లో ఆండ్రోజెన్, అనాబాలిక్ స్టెరాయిడ్స్‌తో పాటు 22 రకాల మందులను విచ్చలవిడిగా అమ్ముతుండడంతో యూత్భవిష్యత్ అంధకారంలో పడుతోంది.
ఢిల్లీ, పంజాబ్‌లలో తయారీ ..
అనబాలిక్ డ్రగ్స్ ను ఎక్కువగా ఢిల్లీ, పం జాబ్ ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు. వీటికి ఎలాంటి ఫార్ములా ఉండదు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. అయితే, పోలీసులు, డ్రగ్‌కంట్రోల్ ఆఫీసర్ల దాడులు పెరగడంతో ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. జిమ్ఓనర్లు, ట్రైనర్లతో పరిచయాలు పెంచుకుని నమ్మకం కుదిరాకే సేల్ చేస్తున్నారు. ఇంజక్షన్లు, పౌడర్లను వంద శాతం లాభాలకు అమ్ముకుంటున్నారు.
ఈ సమస్యలొస్తాయి..
అనబాలిక్, ఆండ్రోజెన్ స్టెరాయిడ్స్ అదే పనిగా వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. లైంగిక సామర్థ్యం దెబ్బ తినడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మానసిక సమస్యలు, హై బీపీ, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల ఫెయిల్యూర్‌కూ కారణమవుతుంది. ఆండ్రోజెన్, అనాబాలిక్ వంటి స్టెరాయిడ్స్తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని మిమ్స్దవాఖాన కార్డియక్ సర్జన్ డా.అమరేశ్ చెప్తున్నారు.
కండరాల వ్యాధులతో పాటు కాలేయం చెడిపోతుందని, మానసిక సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వంధ్యత్వానికి దారి తీస్తుందంటున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్పెరుగుతాయంటున్నారు. వీటితో పాటు కొందరు హై ప్రోటీన్ ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండెలో సడెన్ బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది.