హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలో బేబీ పల్స్పడిపోయిందని డాక్టర్లు సిజేరియన్‌ను మధ్యలో ఆపేయడంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ చెందిన మంద వింధ్య నిండు గర్భిణి. డెలివరీ కోసం ఈనెల14న స్థానిక కమలా నెహ్రూ హాస్పిటల్లో అడ్మిట్అయింది.
పురిటి నొప్పులు మొదలవడంతో నార్మల్ డెలివరీ అవుతుందని, సిజేరియన్అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. 15న ఎంతకీ నార్మల్ డెలివరీ కాకపోవడంతో డాక్టర్లు సీజేరియన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో తల్లి కడుపులోని బేబీ పల్స్ రేట్పడిపోయిందంటూ, ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపారు. వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
వెంటనే నల్గొండ ఏరియా హాస్పిటల్ కి తరలించగా, అక్కడి డాక్టర్లు డెలివరీ చేశారు. పాప పుట్టగా, కొద్దిసేపటికే మృతి చెందింది. వింధ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో వింధ్య కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం పాప డెడ్‌బాడీతో నాగార్జునసాగర్కమలా నెహ్రూ హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చచెప్పటంతో ధర్నా విరమించారు.
ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ భానుప్రకాశ్ వివరణ కోరగా.. ఈ నెల14న వింధ్య డెలివరీ కోసం వచ్చిందని, డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చేయాలనగా, వింధ్య బంధువులు నార్మల్ డెలివరీ చేయాలని కోరినట్లు తెలిపారు. టైం తీసుకుంటే కడుపులోని బిడ్డకు ప్రమాదం అని చెప్పినా వినలేదన్నారు. నార్మల్ డెలివరీ చేస్తున్న క్రమంలో బేబీ బయటకు రావడంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని, సరైన ఎక్విప్మెంట్లేకపోవడంతో మరో హాస్పిటల్‌కు పంపించామన్నారు.