
- రెండు మండలాల్లోని 142 మంది స్టూడెంట్లకు చికిత్స
- కనీస జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు
- ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాలో కండ్ల కలక(కంజెక్టీవైటీస్) కేసులుపెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వాన ఉండటంతో వాతావరణంలో తేమ ఏర్పడి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ బాక్టీరియా క్రమంగా పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వర్గల్ మండలంలోని రెండు హాస్టళ్లలో కండ్ల కలక బారిన పడ్డ స్టూడెంట్స్ను అధికారులు గుర్తించి చికిత్సలు అందిస్తున్నారు. విద్యా సంస్థలు, హాస్టళ్ల లో స్టూడెంట్స్ దగ్గరదగ్గరగా ఉంటుండడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ పట్టణాల్లో కూడా పదుల సంఖ్యలో కంజెక్టీవైటీస్ కేసులు నమోదువుతున్నాయి.
142 మంది స్టూడెంట్ల చికిత్స
వర్గల్ నవోదయ విద్యాలయం తోపాటు ములుగు లోని టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పలువురు స్టూడెంట్లకు కండ్ల కలక బారిన పడిన విషయాన్ని వైద్యాధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.కాశీనాథ్ నేతృత్వంలో రెండు వైద్య బృందాలను పంపి మెడికల్ క్యాంపులు నిర్వహించారు. వర్గల్ నవోదయ విద్యాలయంలో 82 మంది స్టూడెంట్స్, ములుగు టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 60మంది స్టూడెంట్స్ కండ్ల కలక బారిన పడ్డట్టుగా గుర్తించారు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందడంతో వెంటనే వారిని వేరే గదుల్లో ఉంచి చికిత్సలు ప్రారంభించారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు రెండు విద్యాసంస్థల్లో ఒక్కొక్క స్టాఫ్ నర్స్ తో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. ఐ డ్రాప్స్, టాబ్లెట్స్ అందించి కంటి శుభ్రత పై అవగాహన కల్పించారు.
జాగ్రత్తలు తీసుకుంటే మేలు
వాతావరణ పరిస్థితుల మూలంగా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కండ్ల కలకకు కనీస జాగ్రత్తలు తీసుకుంటే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ వ్యాధి సోకగానే కండ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం, ఊసులు పేరుకుని దురద లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బారిన పడిన వారికి దగ్గరగా ఉన్నా, పక్కన కూర్చున్నా, వారు వాడిన దుస్తులు వాడినా ఇతరులకు సోకుతోంది. మూడు రోజుల పాటు అందరికీ దూరంగా ఉండి, తగిన మందులు వాడాలని
డాక్టర్లు సూచిస్తున్నారు.
ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్సలు
వర్గల్ మండలాల్లో కండ్ల కలక బారిన పడ్డ 142 మంది స్టూడెంట్లెకు ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్సలు అందిస్తున్నాం. వీరిని మిగతా చిన్నారులకు దూరంగా వ్యక్తిగత శుభ్రతతో పాటు కండ్ల కలకకు కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మూడు రోజుల పాటు ఐడ్రాప్స్, టాబ్లెట్స్ వాడితే తగ్గుతుందని, బాధితులు ఆందోళన చెందవద్దని సూచించారు.
జె.కాశీనాథ్, డీఎంహెచ్వో, సిద్దిపేట