అంబులెన్సులు ఉన్నా.. డ్రైవర్లు లేరు

ఇటీవల అనారోగ్యం పాలైన ఓ వ్యక్తిని ట్రీట్​మెంట్​కోసం దోమకొండ సీహెచ్​సీకి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని కామారెడ్డికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. స్థానికంగా అంబులెన్స్​అందుబాటులో ఉన్నా, నడిపేందుకు డ్రైవర్​లేడు. దీంతో పేషెంట్​కు సైలెన్​బాటిల్​పెట్టి, కిరాయి ఆటోలో కామారెడ్డికి తరలించారు.

  •     ఎంపీ ఫండ్స్​తో సీహెచ్​సీలకు 3 అంబులెన్స్​ల కేటాయింపు
  •     రోగులను తరలించేందుకు డ్రైవర్లు లేక ఇబ్బందులు
  •     డీజిల్​కు సైతం బడ్జెట్​లేని పరిస్థితి
  •     ఏడాదిన్నరగా మూలకు చేరిన వెహికల్స్​

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లోనే కాకుండా సీహెచ్​సీలకు కొత్తగా కేటాయించిన అంబులెన్స్​లతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అంబులెన్సులున్నా డ్రైవర్లు అందుబాటులో లేక ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మెరుగైన ట్రీట్​మెంట్​కోసం వేరే ఏరియాలకు తరలించాలంటే ప్రైవేట్​అంబులెన్స్​లు లేదా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. 

ఎంపీ కోటా ద్వారా కేటాయింపు

అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు జహీరాబాద్​ఎంపీ బీబీ పాటిల్​ఎంపీ కోటా ఫండ్స్​తో 3 అంబులెన్స్ లు కొన్నారు. వీటిని ఏడాదిన్నర కింద దోమకొండ, మద్నూర్, బిచ్కుంద సీహెచ్​సీలకు కేటాయించారు. అంబులెన్స్​లు ఉన్నా, వాటిని వాడడం లేదు. ఈ విషయమై ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్​లో జుక్కల్​ఎమ్మెల్యే హన్మంత్​షిండే ఆఫీసర్లను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని వారు తెలిపారు.   

పరిస్థితి ఇది..

కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా వెనకబడిన నియోజకవర్గం జుక్కల్. ఇక్కడ హాస్పిటల్​సౌకర్యాలు చాలా తక్కువ.   అత్యవసర పరిస్థితుల్లో ఇక్టడి ప్రజలు నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, మహారాష్ర్టలోని నాందేడ్, దెగ్లూర్ లకు వెళ్తారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ బీబీపాటిల్​మద్నూర్, బిచ్కుంద సీహెచ్​లకు ఎంపీ ఫండ్స్​కింద అంబులెన్స్​లు కేటాయించారు. కామారెడ్డి నియోజక వర్గంలోని దోమకొండ సీహెచ్​సీకి మరో అంబులెన్స్​ఇచ్చారు. ఒక్కో వెహికల్​కి రూ.20 లక్షలు ఖర్చయింది. అయితే డ్రైవర్ల నియమాకంపై  ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు దృష్టి పెట్టలేదు. దీంతో అంబులెన్స్​సీహెచ్​సీల్లో మూలన పడ్డాయి. కొన్నిసార్లు తాత్కాలిక డ్రైవర్లతో వీటిని వినియోగించారు. మద్నూర్​లో గతంలో పని చేసిన డ్రైవర్లతో టెంపరరీగా కొన్నిసార్లు వాడిన ట్లు చెబుతున్నారు.   

పేషెంట్లే డీజిల్​పోయించుకోవాలి..

అంబులెన్స్​లకు  డ్రైవర్లు లేకపోవడంతో పాటు డీజిల్​కు బడ్జెట్​లేదు. సీహెచ్​సీల నుంచి ఇతర హాస్పిటల్​కు పేషెంట్​ను అత్యవసరంగా తరలించాల్సివస్తే  రోగుల తరఫున వచ్చిన వారే డీజిల్​పోయించాలి. డ్రైవర్లు, డీజిల్​కు బడ్జెట్​లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్​వెహికిల్స్ ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్​వెహికిల్స్​వాళ్లు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలవారికి అంబులెన్స్​చార్జీలు భారమవతున్నాయి. రూ. లక్షలు ఖర్చుచేసి అంబులెన్సులు కొన్నా, వాటిని వినియోగించక మూలకు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. నాయకులు, ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

108 డ్రైవర్​ను వాడుతున్నాం..

డ్రైవర్​లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో 108  అంబులెన్స్​డ్రైవర్​ను వాడుకుంటున్నాం. అంబులెన్స్​ను వాడుకోవాలంటే పేషెంట్ల సంబంధీకులే డీజిల్​పోయించుకోవాలి. బడ్జెట్​లేక ఈ పరిస్థితి ఏర్పడింది. 

- సంగీత్​కుమార్, సీహెచ్​సీ, దోమకొండ సూపరింటెండెంట్​