తేజశ్రీ అవయవదానం.. పేరెంట్స్​ను ఒప్పించిన డాక్టర్లు

  •     హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు
  •     23న ఉన్మాది దాడితో బ్రెయిన్​డెడ్​
  •     చనిపోయిందని భావించే   తోఫిక్ ​నాటకం: సీపీ 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా జక్రాన్​పల్లిలో ఉన్మాది చేతిలో ఈ నెల 23న పాశవిక దాడికి గురైన ఘనపురం తేజశ్రీ బ్రెయిన్​డెడ్​ అయినట్లు జీజీహెచ్​ డాక్టర్లు తేల్చారు. వెంటిలేటర్​పై ఉన్న ఆమె కోలుకునే అవకాశాలు  లేవని నిర్ధారించిన డాక్టర్లు ఆమె పేరెంట్స్​ను అవయవదానానికి ఒప్పించారు. దీంతో తేజశ్రీని హైదరాబాద్​ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిజామాబాద్​ పోలీస్ కమిషనర్​సత్యనారాయణ బుధవారం మీడియాకు తెలిపారు. ఘటనకు సంబంధించి తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలను వివరించారు. 
 

పట్టించుకోవడం లేదనే దారుణం..


జక్రాన్​పల్లి మండల కేంద్రంలోని ఒకే కాలనీలో నివసించే తేజశ్రీ, తోఫిక్​ల ఎనిమిదేండ్ల స్నేహం అయిదేండ్ల కింద ప్రేమగా మారింది. ఇద్దరూ పెండ్లి  చేసుకోవాలనుకున్నారు. ఇరువైపులా కుటుంబాలకు కూడా ఈ విషయం తెలుసు. తోఫిక్​ను అమితంగా ఇష్టపడే తేజశ్రీ అతని పేరును ఇమ్రాన్​గా మార్చి అందులోని మొదటి అక్షరం ‘ఐ’ ని తన చేతిపై టాటూగా వేయించుకుంది. కానీ లిక్కర్​, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన తోఫిక్​ ప్రవర్తన నచ్చక కొన్నాళ్ల నుంచి తేజశ్రీ అతడిని దూరం పెడ్తోంది. తాను మాట్లాడడం మానేస్తే దురలవాట్లు మార్చుకుంటాడని తేజశ్రీ భావించింది. 

కానీ తోఫిక్​లో మార్పు రాకపోగా ఉన్మాదిగా మారాడు. ఘటన జరిగిన రోజు రాత్రి 9 గంటల టైంలో 10 నిమిషాలు మాట్లాడాల్సి ఉందని బయటకు తీసుకెళ్లిన తోఫిక్,​ తేజశ్రీపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లగా చనిపోయిందని భావించిన తోఫిక్, తేజశ్రీ  బైక్​పై నుంచి పడిందని డ్రామా ఆడాడు.  కాగా, తోఫిక్​ ఒక్కడే ఈ దాడి చేశాడా? అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా? అన్న విషయం త్వరలోనే తేలుతుందన్నారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని, కానీ ఘటనపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నందునే ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్​లో తేలిన విషయాలు చెబుతున్నానని కమిషనర్​ సత్యనారాయణ తెలిపారు.