- పీహెచ్సీల్లో అందుబాటులో ఉందని వైద్యులు
- తనిఖీల్లో బయటపడుతున్న డాక్టర్ల నిర్వాకం
- కొన్నిచోట్ల పీహెచ్సీలకు తాళం
- ఫీల్డ్ విజిట్ సాకుతో క్లినిక్ ల్లో ప్రాక్టీస్
సూర్యాపేట, వెలుగు : స్థానిక పీహెచ్సీ, బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఫీల్డ్ విజిట్ పేరుతో డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కొంతమంది డాక్టర్ల పనితీరుతో వైద్యారోగ్యశాఖ అధ్వాన్నంగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్, పల్లె దవాఖానలు లక్ష్యానికి దూరమవుతున్నాయి.
డాక్టర్లు, సిబ్బంది ఆస్పత్రికి ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల డాక్టర్లు వారానికి ఒకట్రెండు రోజులు మాత్రమే డ్యూటీలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పీహెచ్సీలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచాలి. కానీ, చాలాచోట్ల వైద్యులు సమయపాలన పాటించడం లేదు. డాక్టర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీల్డ్ విజిట్ సాకుతో క్లినిక్ ల్లో ప్రాక్టీస్..
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ క్లినిక్ ల్లో ప్రాక్టీస్ చేయొద్దన్న రూల్స్ ఉన్నప్పటికీ వాటిని బేఖాతర్ చేస్తూ కొంతమంది క్లినిక్ లను నడిపిస్తున్నారు. డాక్టర్లతోపాటు సిబ్బంది సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. గ్రామాల్లో అత్యవసరమైనప్పుడు ఆశావర్కర్లే ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు.
జిల్లాలో అందుబాటులో లేని డాక్టర్లు..
జాజిరెడ్డిగూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామంలోని పల్లె దవాఖానలను గత శుక్రవారం కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో డాక్టర్ తోపాటు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం, దవాఖానకు తాళం వేసి ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ వో కోటాచలానికి ఫోన్ చేసి దవాఖానలో అందుబాటులో లేని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ సీతామహాలక్ష్మి సక్రమంగా డ్యూటీకి హాజరుకాకపోవడంతో డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మునగాల మండలం కలుకవ, కోదాడలోని, అనంతగిరి, చిలుకూరు, త్రిపురారం, కాపుగల్లు గరిడేపల్లి పీహెచ్సీల్లో డాక్టర్లు, సిబ్బంది ఉండడం లేదని ప్రజలు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్ లు నిర్వహిస్తున్నారు.
ఓపీ టైమింగ్స్ కు గంట ముందుగానే డ్యూటీ నుంచి వెళ్లిపోతున్నారు. ఆలస్యంగా వచ్చిన పేషెంట్లకు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీ డాక్టర్ దగ్గరే చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. హుజూర్ నగర్ మండలం మాదవరాయినిగూడెం, మగ్దూంనగర్ బస్తీ దవాఖానల్లో ఒక్కో అటెండర్ మాత్రమే ఉన్నారు. అక్కడ పనిచేయాల్సిన డాక్టర్లు పీజీ సీట్లు రావడంతో వెళ్లిపోయారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల తనిఖీల్లో డ్యూటీలో లేని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వైద్యులు సమయపాలన పాటించి ప్రజలకు వైద్య సేవలు అందించాలి.
– డాక్టర్ కోటాచలం, డీఎంహెచ్‌వో